టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ఏ మాత్రం సిగ్గుపడేదే లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. కడప ఉక్కు పరిశ్రమపై అచ్చెన్నాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో కడప ఉక్కు పరిశ్రమపై అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామన్నారని చెప్పుకొచ్చారు. ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ సర్కార్ నిలదీయడం లేదని ఆయన ప్రస్తావించారు.
కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు దొందు దొందే అని చెప్పక తప్పదు. ఐదేళ్ల పాలనలో కడప ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. ఎన్నికలకు ముందు ఉక్కు పరిశ్రమ నిర్మిస్తానంటూ శంకుస్థాపన చేసి జనం చెవుల్లో పువ్వులు పెట్టారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కూడా టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.
టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. ఇంత వరకూ ఆ పరిశ్రమ అతీగతీ లేదు. ఉక్కు పరిశ్రమ పూర్తి చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని గతంలో తాను ఇచ్చిన హామీని జగన్ మరిచిపోయినట్టున్నారు. ఉక్కు పరిశ్రమపై ఎవరైనా ప్రశ్నిస్తే… కరోనా ఆర్థిక ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టడంతో తన బాధ్యత తీరిపోయిందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.
తమ హయాంలో నిర్మించని, కేంద్రాన్ని ప్రశ్నించని అచ్చెన్నాయుడు, ఇప్పుడు మాట్లాడ్డమే ఆశ్చర్యమేస్తోంది. గతంలో తాము అన్యాయం చేశామని తెలిసి కూడా, ఏ మాత్రం సిగ్గుపడకుండా విమర్శలు చేయడం అచ్చెన్నాయుడు, టీడీపీకే చెల్లింది. రెండు పార్టీలు మాటలతో కరవు ప్రాంతాన్ని మభ్య పెడుతున్నాయనేది వాస్తవం.