తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయ భవనానికి రాజ్యాంగనిర్మాత డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. కేవలం దళితుల్లో మాత్రమే కాదు.. అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలే వ్యక్తం అవుతున్నాయి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తూ మరో అద్భుతాన్ని కూడా కేసీఆర్ సృష్టిస్తున్నారు.
అంబేద్కర్ మీద గౌరవాన్ని ప్రకటించడమే గనుక.. దళితుల మీద ప్రేమకు నిరూపణ అయితే గనుక.. ఆ విషయంలో కేసీఆర్ గొప్పపని చేస్తున్నట్టే లెక్క. అయితే దీని మీద కూడా చవకబారు లేకి నిందలు వేయడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. మద్యం కుంభకోణం నుంచి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ ఇప్పుడు అంబేద్కర్ జపం చేస్తున్నారటూ చెత్తమాటలు మాట్లాడుతున్నారు.
ఒకవైపు సచివాలయానికి అంబేద్కర్ పేరు మంచి నిర్ణయం అంటూనే.. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ కు అంత ప్రేమ ఎక్కడినుంచిచ పుట్టుకు వచ్చింది అంటూ అర్థం పర్థం లేని వాదన లేవనెత్తుతున్నారు. బండి మాటల్లో దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఎందుకు నిలబెట్టుకోలేదనే ప్రశ్న మాత్రమే నిర్మాణాత్మకమైనది.
ఇక్కడ బండి సంజయ్ సంజాయిషీ చెప్పవలసిన అవసరం కూడా ఒకటుంది. ప్రజాగాయకుడు గద్దర్.. కొన్ని రోజుల కిందట బండి సంజయ్ ను కలిశారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా చూడాలని, ఈమేరకు తన విన్నపాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన బండి సంజయ్ ను కోరారు. ఇంతకూ సంజయ్ కనీసం ఆ పని చేశారా లేదా? ప్రజల నుంచి పార్లమెంటు భవనం పేరు కోసం ఒక ఆకాంక్ష వ్యక్తం అయినప్పుడు.. వారు అడిగినట్టుగా కనీసం ప్రధాని దృష్టికైనా తీసుకెళ్లారా? అందుకు ఆయన సమాధానం చెప్పాలి.
గద్దర్ రూపంలో వ్యక్తమైన ఆకాంక్షను కేంద్రం వద్దకు తీసుకెళ్లి.. పార్లమెంటు కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ ను పార్లమెంటు సమావేశాల్లో వినిపించగల దమ్ము, సత్తా, దళిత ప్రేమ బండి సంజయ్ లో ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రశ్న. కేసీఆర్ ఏం చేసినా.. అందులో రంధ్రాన్వేషణ చేయడం, లేకి విమర్శలు చేయడం ఆయన పరువు మాత్రమే కాదు పార్టీ పరువు కూడా తీస్తుంది.
నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే ఎప్పటికీ పార్టీని నిలబెడతాయి. ఆ సంగతి గ్రహించకుండా.. నేలబారు మాటలు మాట్లాడితే లాభం లేదు.