చంద్రబాబు తాజా ప్రకటనతో టీడీపీ ఇన్‌చార్జ్‌ల్లో భయం పట్టుకుంది. సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈ సారి ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
వైసీపీకి చెందిన 70 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు ఈ దఫా టికెట్లు ఇవ్వొద్దంటూ పీకే టీం సిఫార్సు చేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు దృష్టికి టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ… తాను మాత్రం సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వడమే కాకుండా గెలిపించుకుని వస్తానన్నారు.
సిటింగ్‌లకు సీట్లు కన్ఫార్మ్ చేయడం వరకూ బాగుంది. మరి తమ సంగతేంటని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రశ్నిస్తున్నారు. బాబు నాన్చివేత వైఖరిపై మొదటి నుంచి టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. తమతో డబ్బు ఖర్చు చేయించి, పార్టీని నిలబెట్టుకుని, ఆ తర్వాత రకరకాల కారణాలతో మరొకరిని తెరపైకి తేవడం బాబుకి అలవాటుగా మారిందని నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు మండిపడుతున్నారు.
సిటింగ్‌లకు సీట్లు ఖరారు చేసిన చంద్రబాబు, ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికి కూడా అదే రీతిలో టికెట్ ఖరారు చేయొచ్చు కదా? అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. సిటింగ్‌లకు మాత్రమే ఖరారు చేయడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఇక తమ వంతు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు.
టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది ముందే తేల్చితే, రాని వారు తమ దారేదో చూసుకుం టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి చంద్రబాబు నాన్చివేత ధోరణితోనే పార్టీకి నష్టం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆ తప్పులను పునరావృతం చేయకుండా నష్టనివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.