తిరుపతి జిల్లా సత్యవేడు ఎస్సీ రిజర్వ్‌డ్ టికెట్‌ను టీడీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దక్కించుకున్నారు. ఈయనకు సర్వేలో నెగెటివ్ వచ్చిందనే కారణంతో వైసీపీ టికెట్‌ను నిరాకరించింది. కానీ తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఎంపీగా పోటీ చేయడానికి ఆయన నిరాకరించారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అంటూ కోనేటి ఆదిమూలం తీవ్ర విమర్శలు చేశారు.
అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేసి కుమారుడితో కలిసి టీడీపీలో చేరారు. ఇవాళ చంద్రబాబునాయుడు విడుదల చేసిన రెండో జాబితాలో కోనేటి ఆదిమూలం పేరు వుంది. దీంతో గత నాలుగేళ్లుగా టీడీపీ కోసం సత్యవేడులో పని చేస్తున్న నాయకుల స్పందన ఏంటో చూడాలి.
వైసీపీ తరపున రాజేష్ బరిలో ఉన్నారు. ఇతను నాన్‌లోకల్. అయితే సత్యవేడులో రాజేష్ గెలుపును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి కావడంతో పెద్దిరెడ్డి మరింత కసిగా పని చేయనున్నారు. తనపై తీవ్ర విమర్శలు చేసిన కోనేటి ఆదిమూలాన్ని ఓడించే వరకూ పెద్దిరెడ్డి నిద్రపోరనే చర్చకు తెరలేచింది.
ఏది ఏమైనా టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం టికెట్ దక్కించుకోవడం సంచలనమే. ఇప్పటికే టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్ హెలెన్ కొన్నేళ్లుగా నియోజకవర్గమంతా కలియ తిరిగారు. తనకే తప్పకుండా టికెట్ వస్తుందని ఆమె ఎంతో నమ్మకంగా ఉన్నారు. అలాంటిది ఆమెను కాదని వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడం టీడీపీ శ్రేణులకు నిరాశ మిగిల్చింది.