తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాల టీడీపీ అభ్యర్థుల్ని చంద్రబాబునాయుడు ఎట్టకేలకు ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులపై కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రగిరి, శ్రీకాళహస్తి నుంచి పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి పేర్లను చంద్రబాబు ప్రకటించడం విశేషం. దీంతో ఉత్కంఠకు తెరపడింది. బొజ్జల సుధీర్, పులివర్తి నాని ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీకాళహస్తి టికెట్‌ను పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జనసేన ఇన్‌చార్జ్ వినుత నగరం తనకే తప్పకుండా పవన్‌కల్యాణ్ శ్రీకాళహస్తి టికెట్ ఇస్తారని చెబుతూ వచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన బలం సంగతి పక్కన పెడితే వినుత, ఆమె భర్త ఏదో ఒక హడావుడి చేస్తూ నిత్యం వార్తల్లో వుంటున్నారు. అలాగే బీజేపీ టికెట్ తనకే వస్తుందని ఆ పార్టీ ముఖ్య నాయకుడు కోలా ఆనంద్ ఎంతో ఆశగా ఉన్నారు. బీజేపీకే టికెట్ దాదాపు ఖరారైందనే ప్రచారం కూడా జరిగింది.
కానీ శ్రీకాళహస్తి అభ్యర్థిగా బొజ్జల సుధీర్‌రెడ్డిని ప్రకటించడంతో జనసేన, బీజేపీ నేతలు కాసింత షాక్‌కు గురయ్యారు. ఆ పార్టీల నాయకులు బొజ్జల సుధీర్‌రెడ్డి గెలుపు కోసం ఏ మేరకు పని చేస్తారో చూడాలి.
ఇక చంద్రగిరి విషయానికి వస్తే… ఇన్‌చార్జ్ పులివర్తి నాని, ఆయన భార్య సుధారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే చంద్రగిరి రాజకీయ తెరపైకి ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్‌రెడ్డి మెరుపులా వచ్చారు. తనకు టికెట్ ఇస్తే, సామాజిక సమీకరణలు కలిసొచ్చి విజయం సాధిస్తానని ప్రచారం చేసుకున్నారు. చివరికి పులివర్తి నానీకే టికెట్ దక్కింది. దీంతో ఎలాంటి అసంతృప్తులకు, రచ్చకు చోటు లేకుండా పోయింది.