పొత్తు కూడా పెళ్లి లాంటిదేనా బ్ర‌ద‌ర్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు ప‌ట్ట‌భ‌ద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు 13న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ప్ర‌త్య‌ర్థులు జ‌ట్టు క‌ట్టారు. అయితే పొత్తులో ఉన్న రెండు పార్టీలు మాత్రం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు ప‌ట్ట‌భ‌ద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల‌కు 13న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ప్ర‌త్య‌ర్థులు జ‌ట్టు క‌ట్టారు. అయితే పొత్తులో ఉన్న రెండు పార్టీలు మాత్రం ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌డం లేదు. ఇది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు, టీడీపీ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని ఒక అంగీకారానికి వ‌చ్చాయి.

టీడీపీతో సీపీఐ నాయ‌కులు కె.నారాయ‌ణ‌, రామ‌కృష్ణ స‌న్నిహిత సంబంధాల‌ను మొద‌టి నుంచి క‌లిగి ఉన్నారు. కానీ సీపీఎం దూరంగా వుంటూ వ‌స్తోంది. ప్ర‌స్తుత రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా మూడు పార్టీలు ఒక అవ‌గాహ‌న‌కు రావ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ, జ‌న‌సేన పార్టీలు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించుకుంటున్న దాఖ‌లాలు లేవు. వైసీపీని ఓడించాల‌ని మాత్ర‌మే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పిలుపుగా ఆ పార్టీ నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు.

మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీకి అధికారికంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌న‌సేనాని మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్‌ను బీజేపీ మ‌ద్ద‌తు అడిగిన‌ట్టు, వారు ఇస్తున్న‌ట్టు ఎక్క‌డా చిన్న ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌లేదు. దీన్ని బ‌ట్టి అస‌లు ప‌వ‌న్‌ను బీజేపీ ప‌ట్టించుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంది. 

మ‌రోవైపు మిత్ర‌ప‌క్ష‌మైన త‌మ‌తో మాట మాత్ర‌మైనా సంప్ర‌దించ‌కుండా వైసీపీని ఓడించాల‌ని జ‌న‌సేన పిలుపు ఇవ్వ‌డంపై బీజేపీ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉద్దేశ పూర్వ‌కంగానే ఇదంతా చేస్తున్నార‌ని జ‌న‌సేన నేత‌లు భావిస్తున్నారు.

గెలుపోట‌ముల‌ను పక్క‌న పెడితే త‌మ‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం న్యాయ‌మైంద‌ని బీజేపీ అభిప్రాయం. ప‌వ‌న్‌కు రాజ‌కీయ అవ‌గాహ‌న రాహిత్య‌మా?  లేక అహంకార‌మా? అని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో గెల‌వ‌డానికి ప్ర‌య‌త్నించే వాళ్ల‌నే ఎప్ప‌టికైనా ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని, అలా కాకుండా మ‌రెవ‌రినో ఓడించ‌డానికి మాత్ర‌మే ఉన్నార‌నే నేత‌ల‌కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. 

ఇదిలా వుండ‌గా బీజేపీతో పొత్తులో ఉంటూ, ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. పొత్తు కూడా పెళ్లి లాంటిదేనా బ్ర‌ద‌ర్ అంటూ వ్యంగ్య కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.