ఎన్నిక‌ల భ‌యాన్ని రుచి చూస్తున్న వైసీపీ

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారి వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భ‌యాన్ని రుచి చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు గ్రాడ్యుయేట్లు, రెండు టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ భ‌యం క‌నిపిస్తోంది. ఇంత‌కాలం ఎన్నిక ఏదైనా గెలుపు…

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారి వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భ‌యాన్ని రుచి చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు గ్రాడ్యుయేట్లు, రెండు టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ భ‌యం క‌నిపిస్తోంది. ఇంత‌కాలం ఎన్నిక ఏదైనా గెలుపు త‌మ‌దే అనే ధీమా వైసీపీలో క‌నిపించేది. ఆ ఉత్సాహంతోనే గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో వైసీపీ నిలిచింది. తాజాగా వామ‌ప‌క్షాలు, టీడీపీ ప‌ర‌స్ప‌రం అంగీకారానికి రావ‌డంతో ఆ పార్టీల అభ్య‌ర్థుల‌కు బ‌లం పెరిగిన‌ట్టైంది.

తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌కు సంబంధించి గ్రాడ్యుయేట్స్‌, టీచ‌ర్స్‌, అలాగే ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు తీవ్ర హోరాహోరీని త‌ల‌పిస్తున్నాయి. ప్ర‌భుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఫ‌లితం వైసీపీకి అనుకూలంగా రాక‌పోతే మాత్రం ఆ పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డుతుంది. రాయ‌ల‌సీమ‌లో రెండు ప‌ట్ట‌భ‌ద్రుత‌ల స్థానాల ఫ‌లితాల‌పై ఎవ‌రూ ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ ఉపాధ్యాయ స్థానాల విష‌యంలో మాత్రం వైసీపీకి ఎదురు గాలి త‌ప్ప‌ద‌ని ప్ర‌త్య‌ర్థులు ఎంతో ధీమాగా చెబుతున్నారు. ఈ రెండింటిపై వామ‌ప‌క్షాలు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాయి. ఎందుకంటే ఇవి వాటి సిట్టింగ్ స్థానాలు.

తూర్పు, ప‌శ్చిమ‌ రాయ‌ల‌సీమ ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గాల నుంచి పీడీఎఫ్‌ అభ్య‌ర్థులుగా బాబురెడ్డి, క‌త్తి న‌ర‌సింహారెడ్డి, వైసీపీ త‌ర‌పున పి.చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డి బ‌రిలో ఉన్నారు. తూర్పులో 30 వేల ఓట్లు, ప‌శ్చిమ‌లో 28 వేల ఓట్లు ఉన్నాయి. ప్రైవేట్ టీచ‌ర్స్ ఓట్లు 10 వేల‌కు త‌క్కువ కాకుండా న‌మోదు చూశారు. వైసీపీ ఎక్కువ‌గా ప్రైవేట్ టీచ‌ర్స్ ఓట్ల‌నే న‌మ్ముకుంది. ఒక అభ్య‌ర్థి గెలుపొందాలంటే పోలైన ఓట్ల‌లో స‌గానికి పైన రావాలి. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే ఏ ఒక్క‌రికీ మొద‌టి ప్రాధాన్యత ఓట్ల‌లో విజ‌యం ద‌క్కే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

దీంతో రెండు ప్రాధాన్యం ఓట్లు కీల‌కం కానున్నాయి. మొద‌టి ప్రాధాన్యం ఓట్లు వైసీపీకి బాగా రావ‌చ్చ‌ని, అయితే అవి విజ‌యాన్ని ఇవ్వ‌లేవ‌నేది ప్ర‌త్య‌ర్థుల మాట‌. రెండో ప్రాధాన్యం వ‌చ్చే స‌రికి వైసీపీపై మొగ్గు చూపే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే మాట వైసీపీ నేత‌లు కూడా అంటున్నారు. అయితే రెండో ప్రాధాన్యం వ‌చ్చే స‌రికి ఓట్లు చీలుతాయ‌ని వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఇది కేవ‌లం ఓ అంచ‌నా, న‌మ్మ‌కం మాత్ర‌మే. 

ఒక‌వేళ న‌మ్మ‌కం నిజం కాక‌పోతే… ఏంట‌నే ఆలోచ‌నే వైసీపీని భ‌య‌పెడుతోంది. అందుకే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా అధికార పార్టీ విజ‌యం కోసం చెమ‌టోడ్చుతోంది. మొత్తానికి భ‌యాందోళ‌న‌లో ఉంద‌న్న‌ది వాస్త‌వం. మ‌రి ఫ‌లితం ఎలా వుంటుందో చూడాలి.