కేంద్ర మంత్రులూ విశాఖకు జై కొట్టారు

విశాఖ మహా నగరం గురించి ఎవరైనా మంచి మాటే చెబుతారు. జీవితంలో ఒకసారి అయినా టూర్ చేయాల్సిన సిటీగా విశాఖ ప్రతీ వారి అజెండాలో ఉంటుంది. ఏపీకి బలమైన నగరం ఏది అన్నది దేశాన్ని…

విశాఖ మహా నగరం గురించి ఎవరైనా మంచి మాటే చెబుతారు. జీవితంలో ఒకసారి అయినా టూర్ చేయాల్సిన సిటీగా విశాఖ ప్రతీ వారి అజెండాలో ఉంటుంది. ఏపీకి బలమైన నగరం ఏది అన్నది దేశాన్ని ఏలే కేంద్ర మంత్రులకు తెలియదు అనుకుంటే పొరపాటే. ఎంతసేపూ జగనే విశాఖ రాజధాని గురించి మాట్లాడుతున్నారు అని ప్రతిపక్ష తెలుగుదేశం అక్కసు పడితే పడొచ్చు కాక. కానీ విశాఖ కంటే గొప్ప సిటీ ఏపీలో మరేముందో ఆ పార్టీ సహా విపక్షాలకు తెలియని విషయం కానే కాదు.

విశాఖలో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అయితే విశాఖను ఆకాశానికి ఎత్తేశారు. విశాఖ వంటి నగరం ఉండడం ఏపీకి ఒక వరం అదృష్టం అని అన్నారు. శతాబ్దాలుగా విశాఖ దేశంలోనే కీలకంగా ఉందని ఆయన గుర్తు చేశారు. 

విశాఖ కేంద్రంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామం అని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో విశాఖకు ఎపుడూ ప్రత్యేక నగరంగా ఉందని కేంద్ర మంత్రి సోనోవాల్ అనడం వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెబుతున్న వైసీపీ ప్రభుత్వానికి కొత్త శక్తిని ఇచ్చినట్లు అయింది.

పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఆరు వేల కోట్ల రూపాయలతో విశాఖ టూ భోగాపురం దాకా ఆరు లైన్ల రోడ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశాఖ ప్రాముఖ్యతను తెలియచెప్పినట్లు అయింది. విశాఖ గొప్ప నగరం అని పెట్టుబడిదారులు కూడా తమ ప్రసంగాలలో చెప్పడం విశేషం. 

రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి విశాఖకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధతో విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడంతో నగర ప్రగతికి ఆకాశమ హద్దు అన్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు. విశాఖ చుట్టూ సమ్మిట్ లో వక్తల ప్రసంగాలు సాగడం బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం సాధించిందని అంటున్నారు.