అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి గట్టి సమాధానం ఇవ్వాలని అధికార పార్టీ వైసీపీ నిర్ణయానికి వచ్చింది. అందుకే బీఏసీ సమావేశంలో టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలపై చర్చించాలని ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
నిరుద్యోగం, మద్యనిషేధం, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు తీరు తదితర వాటిపై చర్చించాలని ప్రధాన ప్రతిపక్షం ప్రతిపాదించింది. ఇందుకు ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించడం ఆశ్చర్యం కలుగుతోంది.
సహజంగా ప్రతిపక్షం ప్రతిపాదించే అంశాలపై చర్చించేందుకు అధికార పక్షం ముందుకు రాదు. తమ ఎజెండాపై చర్చించేందుకే అధికార పక్షం మొగ్గు చూపుతుంటోంది. అయితే టీడీపీ తరపున బీఏసీ సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడు ఏపీలో అభివృద్ధి, ఇతరత్రా సమస్యలపై చర్చించాలని కోరారు. గత మూడేళ్లలో చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నామనే ధీమాతో జగన్ ప్రభుత్వం ఉంది.
అందుకే ప్రతిపక్షం ప్రతిపాదించిన ప్రతి అంశంపై చర్చించి, టీడీపీ వ్యూహాల్ని తిప్పికొట్టాలనే నిర్ణయించుకుంది. ఇందుకు సరైన వేదిక అసెంబ్లీనే అని అధికార పక్షం ఆలోచించింది. అందుకే టీడీపీ ప్రతిపాదనపై ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
టీడీపీ ప్రతిపాదిత అంశాలపై వైసీపీ సమాధానం ఏం ఇస్తుందనే ఉత్కంఠ రేపుతోంది. అన్నిటికి మించి ముందుగా అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడం అతిపెద్ద టాస్క్.