మంత్రి ఆర్కే రోజా మరోసారి ప్రత్యర్థులపై చెలరేగిపోయారు. ముఖ్యంగా లోకేశ్‌ను వాడుగీడు అంటూ రోజా దూషణకు దిగారు. జగన్‌ను లోకేశ్ అమర్యాదగా మాట్లాడితే ఊరుకోమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. అసలు ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా? అని ఆమె నిలదీశారు.
ప్రజా సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ధే లేదన్నారు. సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. వాళ్లకు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు ముఖ్యం కాదన్నారు. మాజీ మంత్రి కొడాలి నానిని చంపుతామంటూ టీడీపీ నేతలు హెచ్చరించడంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు.
రోజా స్పందిస్తూ కొడాలి నాని, తాను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చామన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం టీడీపీనే కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేశాడని విమర్శించారు. అందువల్లే అందరం కూడా ఆ పార్టీ నుంచి బయటికొచ్చామన్నారు. కొడాలి నాని మాట్లాడిన మాటల్లో ఏం తప్పుందని రోజా ప్రశ్నించారు. అడ్రస్ లేని వెదవ లోకేశ్ తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని రోజా ప్రశ్నించారు.
కొడాలి నాని అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆడవాళ్లని వాళ్ల ఇంటిమీదకి పంపి చంపేస్తాం, పొడిచేస్తాం అంటారా అని రోజా మండిపడ్డారు. కొడాలి నాని గడ్డంలో ఉన్న తెల్ల వెంట్రుకను కూడా పీకలేరని ఆమె ఘాటు వ్యాఖ్య చేశారు. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.