అనుకున్నది సాధించాలంటే ముందు అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర పెద్దలు ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అన్న సందేహాలను ఉక్కు ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని భావిస్తోంది. దాంతో ఏడాదిన్నరగా కేంద్రం నుంచి పెద్దగా సాయం లేదు, పైగా వరసబెట్టి అనేకరకాలైన ఇబ్బందుకు ఎదురవుతున్నాయి. దీంతో ఉక్కు బక్కచిక్కి సగానికి సగం అయిపోయింది. ఒకనాడు అంటే ప్రైవేటీకరణ ప్రతిపాదనకు ముందు విశాఖ ఉక్కు ఉత్పత్తి రోజుకు ఇరవై వేల టన్నులుగా ఉండేది.
కానీ ఇపుడు చూస్తే అది సగమైపోయింది. అంటే ఏకంగా పదివేల టన్నుల రోజువారీ ఉత్పత్తికి పడిపోయింది. దీనికి కేంద్రం కావాలని చేస్తున్న సహాయ నిరాకరణతో పాటు వివిధ విభాగాలకు అవసరమైన వాటిని అందించకపోవడం, ఉద్యోగుల ఖాళీలు, మెటీరియల్ సరఫరాలో జాప్యం, తగ్గింపు ఇలా అనేక రకాల చక్రబంధంలో ఉక్కుని బంధించి ఈ రోజుకు సగం ఉత్పత్తికి పడిపోయేలా చేశారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే మూడు బ్లాక్ ఫర్నేస్ లలో ఒకటి మూత పడిందని, మిగిలిన వాటి విషయం డౌట్ లో ఉందని చెబుతున్నారు. ఉక్కుని ఏదో రోజున ప్రైవేట్ పరం చేయడం కోసమే ఈ విధంగా కేంద్రం చేస్తోందని ఉక్కు కార్మిక సంఘాలు ఆవేదన చేస్తున్నాయి.