ఏపీలో విపక్ష రాజకీయం విచిత్రంగా సాగుతోంది. అధికార పక్షాన్ని విపక్షం విమర్శించడం సహజం. అయితే రాజకీయాల్లో అన్ని విద్యలూ నేర్చిన చంద్రబాబు ఉన్నారు. ఆయన వెలుగులో మిగిలిన పక్షాలు వెలవెలపోతున్నాయి. సినీ గ్లామర్ నిండా నింపుకుని బలమైన సామాజిక వర్గానికి చెందిన పవన్ అయినా వైఎస్సార్ వంటి రాజకీయ మేటి కడుపున పుట్టిన షర్మిల వంటి వారు అయినా సొంత ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు.
ఇది ఏపీలో విపక్షాలకు శాపమనే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏ విమర్శ చేసినా స్క్రిప్ట్ చంద్రబాబుదే అని వైసీపీ అంటుంది. జనాలలో కూడా అది అనుమానాలకు దారి తీసేలా ఉంటోంది. దానికి కారణం ముందే చెప్పినట్లుగా బాబు చాణక్య రాజకీయం, నేర్పుగా ఓర్పుగా వ్యవహరించలేని విపక్షం అని చెప్పాల్సి ఉంది.
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె అన్న ప్రాసన నాడే ఆవకాయ తిన్న చందాన వస్తూనే వైసీపీ మీద వీర లెవెల్ లో రెచ్చిపోయారు. విమర్శల జడివాన కురిపించారు. దాంతో ఆమె గొంతులో పలికే ప్రతీ పలుకూ చంద్రబాబుదే అన్న వైసీపీ ఆరోపణలు నిజమే అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
ఆమె వైసీపీ మీద జగన్ మీద తీవ్ర విమర్శలు చేశాక తాపీగా నాలుగవ రోజున టీడీపీ మీద జనసేన మీద విమర్శలు కొంత వరకూ చేస్తున్నారు. అలా తమ పార్టీ అందరినీ విమర్శిస్తుంది, కాంగ్రెస్ అధికార విపక్షాలకు వారి రాజకీయ విధానాలకు వ్యతిరేకం అన్నట్లుగా సంకేతాలు వచ్చేలా చూస్తున్నారు.
కానీ ఏపీ జనాలు అయితే ఒకటి అర్థం చేసుకుంటున్నారు. ఆమెకు జగన్ తో గొడవలు ఉన్నాయని. ఆమె చెప్పినట్లుగా అన్యాయం చేశారు అని ఆరోపించినట్లుగా ఏదో జరిగిందని, దానికి బదులు తీర్చుకోవడానికే కాంగ్రెస్ లో చేరారు అని. ఈ సిగ్నల్ జనంలోకి వెళ్లాక ఇక షర్మిల ప్రసంగాలకు విలువ ఏముంటుంది. ఆమె కాంగ్రెస్ వంటి అడుగంటిన పార్టీకి జవసత్వాలు అందించాలంటే ముందు తన ప్రసంగాల విషయంలోనే శ్రద్ధ వహించాల్సి ఉందని అంటున్నారు.
జగన్ రెడ్డి అంటూ తొలి రోజున విమర్శించి ఆ తరువాత జగనన్న అంటాను అని సెటైర్లు పేల్చడం ఇవన్నీ కూడా జనాలకు ఏదోలా తోస్తున్నాయి. ఆమె రాజకీయం ఇప్పటికే తెలంగాణాలో చూసారు. ఏపీలో కాంగ్రెస్ తీరు కూడా చూస్తున్నారు. ఒకనాడు కేంద్ర మంత్రులుగా చేసి చక్రం తిప్పిన వారు ఈ రోజు కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని షర్మిల వెనకాల ఉన్నారు అంటే ఏపీ కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ ఎరుకే.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ రెండు నెలల వ్యవధిలో లేచి కూర్చుని అధికారం వైపు పరుగులు తీస్తుందని బుర్ర ఉన్న వారు ఎవరూ అనుకోరు. అందుకే షర్మిల చేసే విమర్శలు ఏ పార్టీకి లాభిస్తాయో కూడా సగటు ప్రజలకూ తెలుసు అంటున్నారు. ఈ కారణంగానే విపక్షం గొంతు చించుకుంటే బాబు సౌండే అక్కడ వినిపిస్తోంది.
ఇది చంద్రబాబుకు ఒక విధంగా అదృష్టం అయితే మరో విధంగా ఇబ్బందే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని పార్టీలు విమర్శలు చేసినా వచ్చే ఓటు మాత్రం అదే. పైగా అన్ని పార్టీలను టీడీపీ మ్యానేజ్ చేస్తోంది అన్న నిందలు కూడా మోస్తే మరింత ఇరకాటంగా ఉంటుంది. ఇంతటి చరిత్ర కలిగిన టీడీపీ ఒంటరిగా వైసీపీ మీద ఎందుకు పోరాడలేకపోతోంది అన్న చర్చ వస్తోంది. అది అసలుకే ఎసరుగా మారుతోంది.