చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటో 9వ తేదీన ప్రకటిస్తానని ఆయన అన్నారు. అయితే ఆయన ఇలా తరచుగా పార్టీలు మారడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అని.. నిలకడ లేని వ్యక్తిగా ఆమంచి ముద్రపడిపోయారని స్థానికంగా ప్రజలు అనుకుంటున్నారు. ఈ నిలకడలేనితనం కారణంగా.. ఆయన ఎంత మేరకు ప్రజల నమ్మకాన్ని పొందగలరనేది కష్టమేనని భావిస్తున్నారు.
చీరాలకు చెందిన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కరణం బలరామ కృష్ణమూర్తి చేతిలో 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాతి పరిణామాల్లో కరణం బలరాం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంతో ఆమంచికి గడ్డురోజులు మొదలయ్యాయి.
చీరాల నియోజకవర్గంలో ఆమంచి- కరణం వర్గాలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ నిత్యం కొట్టుకుంటూ ఉండేవి. ఈ సందర్భం వచ్చినా సరే.. ఈ రెండు వర్గాల ఘర్షణల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ ఉండేది. పరిస్థితులు పార్టీ నాయకత్వానికి కూడా చాలా తలనొప్పిగా మారాయి.
నిజానికి ఆమంచి కృష్ణమోహన్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచారు. జడ్పీటీసీగా కెరీర్ ప్రారంభించిన ఆయన తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2014 నాటికి విభజనానంతర పరిణామాల్లో నవోదయం పేరుతో పార్టీని స్థాపించి ఆ పార్టీ తరఫున పోటీచేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక పార్టీ పెట్టి రాష్ట్రమంతా పోటీచేసినా ఒక్కరూ గెలవలేదు గానీ.. ఆమంచి తన సొంత పార్టీ తరఫున తాను చీరాలలో ఎమ్మెల్యేగా గెలిచారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేశారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. రాష్ట్రమంతా జగన్ హవా పనిచేసినా కూడా.. చీరాలలో ఆయన నెగ్గలేకపోయారు.
కరణం బలరాం చేరిక తర్వాత.. అసంతృప్తిగా ఉన్న ఆమంచిని పర్చూరు ఇన్చార్జిగా నియమించారు జగన్. తాజాగా టికెట్ల కేటాయింపులో తనకు పర్చూరు టికెట్ కూడా దక్కకపోవడంతో.. అలిగిన ఆమంచి ఇప్పుడు పార్టీకి రాజీనామాచేశారు. ఆమంచి రాజకీయాల్లో ఎంతో కీలకమైన ఆయన సోదరుడు స్వాములు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. మరి ఆమంచి ఏం చేస్తారు? 9న ఆయన ప్రకటించే నిర్ణయం ఏంటి? ఇండిపెండెంటుగా పోటీచేస్తారా? లేదా మళ్లీ తెలుగుదేశంలో చేరి.. ఏదైనా అవకాశం కోసం నిరీక్షిస్తారా? అనేది వేచిచూడాలి.