అమరావతి అంటే … ఇంతకాలం కమ్మ సామాజిక వర్గం రాజధానిగా ఆరోపణలు ఎదుర్కొంది. వైసీపీ కూడా కమ్మ సామాజిక వర్గం కేంద్రంగా ఘాటైన విమర్శలు చేసింది. అయితే అమరావతిలో ఇవాళ 50,793 మంది నిరుపేద కుటుంబాలకు సెంటు చొప్పున నివాస స్థలాల పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగంలో అమరావతిపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
‘అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా. ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా’ అని సీఎం జగన్ హర్షధ్వానాల మధ్య అన్నారు. ఇక మీదట అమరావతి కేవలం కమ్మ సామాజిక వర్గానికే కాకుండా, అన్ని కులాలకు నివాసయోగ్యమని జగన్ ఉద్దేశం.
ఇళ్ల నివాస స్థలాల పంపిణీలో సామాజిక న్యాయానికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 50,793 మంది లబ్ధిదారుల్లో బీసీలు 26,869, ఎస్సీలు 8,495, ఎస్టీలు 1,579, అగ్రవర్ణాల పేదలు 13,850 మంది ఉన్నట్టు జగన్ సర్కార్ లెక్కలు చెబుతోంది. అందుకే జగన్ ప్రత్యేకంగా సామాజిక అమరావతి అని నొక్కి చెప్పడం. ఇన్ని వేల కుటుంబాల్లో ఇంటికి ముగ్గురు లేదా నలుగురు చొప్పున లెక్కలేస్తే ఒక్కసారిగా లక్షలాది మందిని అమరావతికి రప్పించిన ఘనత జగన్‌కే దక్కుతుంది.
ఇంతకాలం అమరావతిలో ఒక సామాజిక వర్గానిదే పెత్తనం అనే ప్రచారం వుంది. ఇకపై అలాంటిది వుండదు. జగన్‌ను అభిమానించే సామాజిక వర్గాలకు అమరావతిలో స్థానం దక్కింది. ఇదే ఎల్లో గ్యాంగ్‌ని భయపెడుతోంది.
ఇదిలా వుండగా తన తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు జగన్ ప్రకటించారు. ఇప్పటికే లేఔట్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తయినట్టు జగన్ చెప్పడం విశేషం.