రాజధాని ప్రాంతంలో సుమారు 51 వేల నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాలు ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోసారి మంగళగిరిలో పోటీ చేసి, గెలిచి టీడీపీకి గిఫ్ట్‌గా ఇస్తానని ప్రగల్భాలు పలికిన లోకేశ్, అక్కడి నుంచి పలాయనం తప్పడం లేదు. మంగళగిరిలో పోటీ చేయడం అంటే ఓటమిని కొని తెచ్చుకోవడమే అని చంద్రబాబు తన కుమారుడి భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో వేలాది మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలను టీడీపీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులు తపస్సు చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదన్నారు. జగన్‌ను ఎదుర్కోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
లోకేశ్‌ను ఓడించడానికి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలను అవినాష్ కొట్టి పారేశారు. లోకేశ్‌ను ఎవరూ ఏమీ చేయాల్సిన పనిలేదన్నారు. లోకేశ్ మాటలు, సైగలే ఆయన్ని ఓడిస్తా యని తేల్చి చెప్పారు. జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే వైసీపీని గెలిపిస్తాయన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్ని రకాలుగా భయపెట్టినా సీఎం సభకు జనం రాకుండా చేయలేకపోయారన్నారు.
మంగళగిరి నుంచి లోకేశ్ తప్పుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలపై టీడీపీ తేలు కుట్టిన దొంగలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ రాజకీయ భవిష్యత్‌పై టీడీపీకి బెంగ పట్టుకుందన్నది వాస్తవం. లోకేశ్ పాదయాత్ర చేస్తూ టీడీపీని ఉద్ధరించడం సంగతి పక్కన పెడితే, తన గెలుపుపై దృష్టి సారిస్తే మంచిదనే హితవచనాలు వెల్లువెత్తుతున్నాయి.