అంటరానితనం నేరం అని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు. దళితులు, అణగారినవర్గాలను సమాజం అంటరానివారిగా చూడడం గురించి కథలుకథలుగా వింటున్నాం. అస్పృశ్యత రూపం మార్చుకుంది. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వెనుకబడిన కులాలను చిన్నచూపు చూడడంపై ఎంతోకొంత సమాజంలో చైతన్యం వచ్చింది. ఆ కులాలకు చదువు అందుబాటులోకి రావడం, ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్వతంత్రులుగా బతుకుతుండడంతో వారిని మనుషులుగా చూస్తున్నారు.
కానీ అమరావతి రాజధాని మాత్రం అస్పృశ్యతను కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్థిక అసమతుల్యతే అంటరానితనాన్ని ప్రోత్సహిస్తోంది. అమరావతి రాజధానిని ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ మధ్యకు పేదలు వద్దు అంటూ నినదిస్తుంటే, సభ్య సమాజం నివ్వెరపోతోంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం పట్టుదలతో వుంది. దీన్ని అమరావతి రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రకరకాల పద్ధతుల్లో వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
తమకు మద్దతు కోరే విషయానికి వచ్చే సరికి… ఇది అందరిదీ అని చెబుతారు. కానీ పేదలకు ఇంటి స్థలాలకు ఇచ్చే విషయానికి వస్తే మాత్రం… స్థానికేతరులంటూ అడ్డంకులు సృష్టించడం వారికే చెల్లుతోంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో నివసిస్తున్న పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఆర్‌డీఏ చట్ట సవరణ చేసింది.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 900.97 ఎకరాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తు న్నట్టు ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
పేదలకు ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 47 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఈ స్థాయిలో పేదలకు లబ్ధి కలిగించాలనే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలవకుండా, అడ్డు పడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలను అంటరానివారిగా చూసే మనస్తత్వం వల్లే వారిని రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.