మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని జనసేనాని పవన్ కలవడం రాజకీయంగా తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వీళ్లద్దరి భేటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ నుంచి ఫస్ట్ పంచ్ పడింది. పవన్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.
“సంక్రాంతి పండుగ మామూళ్ళ కోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు” అంటూ మంత్రి అమర్నాథ్ తన మార్క్ విమర్శ గుప్పించారు. నాలుగు రోజుల్లో సంక్రాంతిని జరుపుకోనున్నాం. ఈ నేపథ్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని పవన్‌పై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.
సంక్రాంతి మామూళ్ల కోసమే దత్త తండ్రి వద్దకు పవన్ వెళ్లారని అమర్నాథ్ ఘాటు విమర్శ చేశారు. పవన్‌కల్యాన్ ప్యాకేజీ స్టార్ అంటూ ఎప్పటి నుంచో వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనను ప్యాకేజీ స్టార్ చెప్పుతో కొడ్తానని ఇటీవల పవన్ చేతికి చెప్పు తీసుకుని చూపుతూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. పవన్ వైఖరిపై భిన్న వాదనలు వినిపించాయి.
ఇవాళ అకస్మాత్తుగా చంద్రబాబుతో భేటీ కావడంపై వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. చంద్రబాబు, పవన్ భేటీ ఇది రెండోసారి. భేటీ అనంతరం వారేం మాట్లాడ్తారనే ఉత్కంఠ నెలకుంది. అమర్నాథ్ ట్వీట్‌ను వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.