ఇది ఒక రికార్డు. గతంలో రాజకీయ నాయకుల జీవితాలలో చూడని రికార్డు. ఎన్నికల ముందు కేవలం నెల రోజులు మాత్రమే కొన్ని ఎంపిక చేసుకున్న ప్రాంతాలలో సభలు పెట్టి ఓట్లు అడిగి వెళ్ళిపోయే రాజకీయాన్నే ఇంతకాలం అంతా చూశారు. అలాంటిది ఒక ఎమ్మెల్యే తనకు ఓటేసిన జనాలను ఎన్నికలు అన్నది లేకుండానే నెలల తరబడి వారి గడప తొక్కి మరీ పలకరించడం అంటే అది అచ్చమైన రికార్డుగానే చూడాలి.
వైసీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకూ వెళ్ళి జనాలను కలుస్తున్నారు. కొందరు అయితే దీన్ని సవాల్ గా తీసుకుని మరీ అదే పనిలో ఉంటున్నారు. అలా విజయనగరం జిల్లా ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అయితే తాను ఇప్పటిదాకా 36 వేల కొటుంబాలను నేరుగా కలసానని గర్వంగా చెప్పుకున్నారు.
తమ ప్రభుత్వం అందించిన కార్యక్రమాల మీద ప్రజలు పొందిన ఆనందాన్ని సంతృప్తిని వారి కళ్లలో చూస్తే తనకు మాటలు రావడం లేదు అన్నారు. గత ఏడాది మే 11న ఎస్ కోట కొట్టాంలో మొదలెట్టిన గడప గడపకు కార్యక్రమం గత 150 రోజులుగా నిరాటకంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఓటేసిన ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం పరిష్కరించడం, వారి పరిస్థితులను గమనించడం కంటే ఆత్మ తృప్తి వేరొకటి లేదు అని ఆయన అంటున్నారు.
కొన్ని కారణాల వల్ల సంక్షేమ పధకాలు అందని వారిని సైతం గుర్తించి వారికి వాటిని అందించడం గడప గడపకు కార్యక్రమం వల్లనే సాధ్యపడిందని, అలా కొత్తగా వేయి మందికి తాను పెన్షన్ ఇప్పించాను అని ఆయన అంటున్నారు. ఇప్పటిదాకా 47 సచివాలయాలను సందర్శించామని అక్కడ పనితీరుని అధ్యయమన్ చేశామని తొందరలో తన నియోజకవర్గం మొత్తం అన్ని గడపలను తిరిగి నూరు శాతం కుటుంబాల్ని కలుస్తామని ఎమ్మెల్యే అంటున్నారు.
నిజంగా జగన్ మంచి ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం పెట్టారని కడుబండి శ్రీనివాసరావు లాంటి వారు చెబుతున్నారు అంటే ప్రజలను చేరువ కావడానికి జగన్ కనిపెట్టిన సరికొత్త మార్గం ఇదేనని అంతా అంటున్నారు. రానున్న రోజులలో జగన్ తీసుకున్న ఈ విధననం తప్పనిసరిగా దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అమలు చేస్తారని కూడా అంటున్నారు.