బాబూ.. పవన్! ఎన్నాళ్లీ ముసుగులో గుద్దులాట!

పవన్ కల్యాణ్ ఊరంతా తిరగనివ్వకుండా హోటల్ గదిలోనే ఉండమని అన్నందుకు ఆయన మీద సానుభూతి వెల్లువెత్తి.. చంద్రబాబునాయుడు విజయవాడలో హోటలు గదికి వెళ్లి పరామర్శించారు. ఇవాళ కుప్పంలో జీవో నెం.1 అమలుచేసి.. కావలిస్తే విడిగా…

పవన్ కల్యాణ్ ఊరంతా తిరగనివ్వకుండా హోటల్ గదిలోనే ఉండమని అన్నందుకు ఆయన మీద సానుభూతి వెల్లువెత్తి.. చంద్రబాబునాయుడు విజయవాడలో హోటలు గదికి వెళ్లి పరామర్శించారు. ఇవాళ కుప్పంలో జీవో నెం.1 అమలుచేసి.. కావలిస్తే విడిగా సమావేశాలు పెట్టుకో.. రోడ్ల మీద జనం ఎక్కడ గుమికూడా ఉంటే అక్కడ వ్యాను ఎక్కి స్పీకర్లు పెట్టి మైకులో మాట్లాడతానంటే కుదరదు అని చెప్పినందుకు చంద్రబాబుమీద ప్రేమ వెల్లువెత్తి హైదరాబాదులో ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు పవన్ కల్యాణ్!.

ఏమిటీ డ్రామాలు! ఎంతకాలం ఇలా ముసుగులో గుద్దులాట కొనసాగిస్తారు? తమ రాజకీయ చాటుమాటు వ్యవహారాలను నేరులో కూర్చుని మాట్లాడుకోవడానికి, నేరులో బేరాలు తెగ్గొట్టుకోవడానికి.. ఒక కలయిక సందర్భం కోసం.. ఎంతకాలం కుంటిసాకులు వెతుక్కుంటూ బతుకుతారు.. తెలుగుదేశం, జనసేన అధినేతలు చీప్ పాలిటిక్స్ కు దిగజారుతున్నారు. 

పొత్తుల గురించి మాట్లాడుకోవాలి.. బేరం తెగ్గొట్టుకోవాలి.. బిజెపిని కూడా తమ జట్టులోకి లాక్కు రావడానికి ఏం ఎర వేయాలో.. ఏం పాచిక వేయాలో ఆలోచించుకోవాలి.. ఇవన్నీ ఎజెండా అంశాలు! కానీ పొత్తుల గురించి మాట్లాడుకోవడానికి కలుస్తున్నాం అని చెప్పుకునే దమ్ము లేదు. నిజాయితీగా వ్యవహరించే ధైర్యం లేదు. తాము చేసే ప్రతిపనికీ వారికి ఒక ముసుగు కావాలి. ఇలా ఎంతకాలం రాజకీయం చేస్తారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అంటూ చంద్రబాబునాయుడు పెద్దపెద్ద పదాలు మాట్లాడారు. తన హయాంలో ఎన్నెన్ని ప్రజాఉద్యమాలను అడుగంటా తొక్కేశాడో చంద్రబాబునాయుడు తన ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుంది. 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న తర్వాత కూడా.. ఆయనకు తన కీర్తి కండూతి, ప్రచారం యావ తగ్గడం లేదు. అలాంటి సభలతో ఇంకా జనాన్ని కడతేర్చాలని చూస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం కలిసి కుట్ర చేశారట. ఇంకా నయం.. పోలీసులే వారిని నెట్టేసి, తొక్కేసి చంపేశారని అనకుండా వదిలిపెట్టారు. పవన్ కల్యాణ్, తాను ఎక్కడకు వెళ్లినా జనం పోటెత్తి వస్తున్నారని మెరమెచ్చు మాటలు వల్లిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ పరిస్థితి ఇంకా ఘోరం. పవన్ కల్యాణ్ నిలువెత్తు అజ్ఞానానికి ఏ రకంగా ప్రతిరూపంగా తనను తాను నిరూపించుకుంటూ ఉంటారో.. ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా ప్రజలకు అందుతూ ఉంటే.. చంద్రబాబు సంక్రాంతి కానుక పేరుతో నడిపించిన డ్రామాకు అంతమంది వెల్లువలా ఎందుకు వస్తారు? అని అడుగుతున్నారు పవన్. 

ఉచితంగా వస్తోంటే మనకెందుకు వద్దు అని అనుకునే ఆలోచన సరళి మన సమాజంలో ఎందరికి ఉంది. ప్రభుత్వం ఉచితంగా టీవీలు ఇస్తాం అని ప్రకటిస్తే..‘మాకొద్దు మాఇంట్లో టీవీ ఉంది’ అని ఎవరైనా చెప్తారా? ఇంత కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం వల్ల పవన్ కల్యాణ్ తన పరువు తానే తీసుకుంటున్నారు.