జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో జనంలో ఉన్నారంటే ప్రత్యర్ధి వైసీపీని నాలుగు అంటారు. మరో నాలుగు రివర్స్ లో ఆయనకూ వస్తాయి. వారాహి యాత్ర పేరుతో వైసీపీని తెగ విమర్శిస్తున్న పవన్ కి అంతే స్థాయిలో అధికార పార్టీ నుంచి కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.
పంచ్ డైలాగులకు పెట్టింది పేరుగా ఉన్న మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే పవన్ని పట్టుకుని గట్టిగానే నాలుగు మాటలు అనేశారు. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటేనో, నలుగురిని నాలుగు రకాలుగా తిడితేనో ముఖ్యమంత్రి అయిపోరు అంటూ పవన్ మీద డైరెక్ట్ ఎటాక్ చేశారు.
ముఖ్యమంత్రి కావాలంటే దానికి ఒక లెక్క ఉంది అని ఆయన చెబుతున్నారు. నేను పదిహేను రోజుల పాటు ఉపవాసాలు చేశాను అని పవన్ అంటున్నారు. నేను కూడా ఉపవాసాలు చేస్తాను ఉప ముఖ్యమంత్రిని అయిపోతానా అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయాల్లో మనగలగాలీ అంటే నిబద్ధత ఉండాలని, సహనం, స్థిరత్వం అంకిత భావం ఉండాలని ఆయన సూచించారు. పవన్ వరకూ వస్తే సినీ హీరోగా గ్లామర్ ఉందని, అభిమానులు ఉన్నారని, బలమైన ఒక సామాజికవర్గంలో పుట్టారని అలా అనుకూలతలను వాడుకుంటే ఏదో నాటికి ఎమ్మెల్యే అయి ఉండేవారేమో అని సెటైర్లు వేశారు.
అయితే పవన్ ఎంతసేపూ చెప్పిన మాట చెప్పకుండా మాట్లాడుతూ ఇతర హీరోల ఫ్యాన్స్ కాదు ఆయన అభిమానులు అయినా ఎందుకు ఓటేస్తారు అని ప్రశ్నించారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్యే పదవి చాలు అంటారు, పిఠాపురం సభలో ముఖ్యమంత్రి చేయమంటారు, ముమ్మిడివరంలో మాట్లాడుతూ ఈసారి గెలవకపోయినా పోరాటాలు చేయమని తన పార్టీకి పిలుపు ఇస్తారని ఎద్దేవా చేశారు.
ఇలాగైతే ఎలా పవన్ అని ఆయన మాటలతో చెడుగుడే ఆడేశారు. ఒక న్యూస్ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ గుడివాడ చేసిన ఈ కామెంట్స్ మంట పుట్టించేలాగానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెద్దగా వినిపించని పవన్ పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెర మీదకు మళ్ళీ తేవడం ద్వారా రాజకీయ రచ్చకు గుడివాడ తెర లేపారనే అంటున్నారు. దీనికి జనసేన నుంచి కౌంటర్లు పడే అవకాశం కచ్చితంగా ఉంది.