దాదాపు ఆరు నెలలుగా ఏ పార్టీలో చేరాలంటూ ఊగిసలాడుతున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావులు ఎట్టకేలకు కాంగ్రెస్ చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసిన ఇరువురు నేతలు తాము కాంగ్రెస్లో చేరబోతున్నట్లు అధికారంగా ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో, పాలమూరు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి రాహుల్ గాంధీ సమక్షంలో తమతో పాటు తమ అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చాక తాము అనేక సర్వేలు చేయించుకున్నామని.. అన్ని ప్రధాన పార్టీల నుండి ఆఫర్లు వచ్చాయని.. ఓ దశలో ప్రాంతీయ పార్టీ కూడా పెట్టాలనుకున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలీపోయి కేసీఆర్కు ప్రయోజనం కలుగుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ మాయ మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారని ఇప్పుడు కూడా అదేరీతిన అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ను గద్దె దించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ చేరబోతున్నట్లు ప్రకటించారు.
మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజాస్వామం పాతాళంలోకి.. అవినీతి ఆకాశంలోకి వెళ్లందని దుయ్యబట్టారు. స్వచ్ఛంగా ఉద్యమం సాగినట్లే పరిపాలన సాగుతుందని ఆశిస్తే.. అధికారమే పరమావధిగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఉండొద్దని నియంతలా వ్యవహరించే వ్యక్తి మరోసారి అధికారంలోకి రావద్దనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
జూల్తె 2న ఖమ్మంలో, జూలై 14 లేదా 16న పాలమూరులో ఇరువురు నేతలు బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇద్దరు నేతలు ఇన్ని రోజులు తమ గొప్పలు చెప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత వారితో పాటు ఎంత మంది అనుచరులకు సీట్లు ఇప్పించుకోని.. ఎంత మందిని గెలిపించుకుంటారు అనేది చూడాలి.