జగన్ మీద డైరెక్ట్ గానే!

ఏపీ సీఎం జగన్ మీద డైరెక్ట్ గానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటు హాటు విమర్శలు చేశారు. జగన్ పాలన అవినీతిమయం అన్నారు. ఏపీ అన్నింటా వెనకబడింది అంటే కారణం వైసీపీయే…

ఏపీ సీఎం జగన్ మీద డైరెక్ట్ గానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటు హాటు విమర్శలు చేశారు. జగన్ పాలన అవినీతిమయం అన్నారు. ఏపీ అన్నింటా వెనకబడింది అంటే కారణం వైసీపీయే అనేశారు. ఏపీకి దండీగా నిధులను కేంద్రం ఇస్తోందని అమిత్ షా పేర్కొన్నారు.

విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టిన అమిత్ షా ఏపీ ప్రభుత్వం వల్లనే ప్రగతి కనిపించడంలేదు అంటూ ఆరోపణలు చేశారు. ఏపీ మీద బీజేపీ ఎంతో ప్రేమ చూపిస్తూ నిధులను వెల్లువలా పారించిందని ఆయన అంటున్నారు. కేంద్రం ఏపీకి ఎంతో చేసినా స్థానిక ప్రభుత్వాలు వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలేదు అని అమిత్ షా మండిపడ్డారు. ఏపీలో ప్రజలు బీజేపీని ఎన్నుకుంటే తామే పూర్తి స్థాయిలో అభివృద్ధికి భరోసా ఇస్తామని అంటున్నారు.

ఏపీలో పాతిక ఎంపీ సీట్లు ఉంటే ఇరవై దాకా బీజేపీకి ఖాతాలో వేయాలని ఆయన జనాలను కోరారు. ఏపీకి ఎంతో చేశామని చెబుతున్న బీజేపీ పెద్దల నుంచి ప్రత్యేక హోదా ఏమైంది, విశాఖ రైల్వే జోన్ సంగతి ఏమిటి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు అని మాత్రం ఎవరూ అడగకూడదేమో.

తాము ఏపీకి ఎంతో చేశామని చెబితే నమ్మాల్సిందే. ఏపీలో ఇరవై నుంచి పాతిక ఎంపీ సీట్లనూ బీజేపీకి ఇచ్చి గెలిపించాల్సిందే. ఎందుకంటే ఏపీ మీద బీజేపీకి ఎంతో అభిమానం ఉంది. అలా అనుకోమంటున్నారు. నిన్న జేపీ నడ్డా అయినా నేడు అమిత్ షా అయినా తాము  ఏపీకి ఎంతో చేశామని అంటున్నారు.

విశాఖ అరచాకాలకు   అడ్డా అయిందని, ఏపీ భూ మాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగిపోతున్నాయని, గంజాయి అక్రమ రవాణాకు కేరాఫ్ ఏపీ అని అమిత్ షా అంటున్నారు. ఇవన్నీ వింటూంటే అరిగి పోయిన టీడీపీ నేతల విమర్శలుగా అనిపిస్తున్నాయంటున్నారు. బీజేపీ పొత్తుల కోసమో రాజకీయ ఎత్తుల కోసమో ఏపీలో కొత్త పంధాలో సాగుతోంది అని అంటున్నారు.