భారతీయ జనతా పార్టీకి సాధారణంగా.. ఫోకస్ మొత్తం పార్లమెంటు ఎన్నికల మీదనే ఉంటుంది. ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తాం అనే ముచ్చట ఉండే రాష్ట్రాల విషయంలో తప్ప.. మిగిలిన చోట్ల అసెంబ్లీ ఎన్నికల గురించి వారు అంతగా పట్టించుకోరు. కానీ పార్లమెంటు ఎన్నికల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒకే సీటు గెలిచిన బిజెపి, 2019 పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి సర్వశక్తులు ఒడ్డి నాలుగు ఎంపీలను గెలుచుకోవడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
ఇప్పుడు ఏపీ రాజకీయాలను గమనిస్తే కూడా అలాంటి అభిప్రాయం కలుగుతోంది. విశాఖ వేదికగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని మోడీ తొమ్మిదేళ్లలో సాగించిన విజయాలను ప్రచారం చేయడం లక్ష్యంగా ఈ సభలు జరుగుతున్నాయి. పనిలో పనిగా.. జగన్ సర్కారు మీద కూడా అమిత్ షా విమర్శలు చేశారు. ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవు. శ్రీకాళహస్తి సభలో జెపి నడ్డా.. సర్కారు మీద ఏ విమర్శలైతే చేశారో.. దాదాపు అదే స్క్రిప్టును అమిత్ షా మరోసారి చదివి వినిపించినట్లుగా ఆ సభ సాగింది.
అయితే ఈ సభలో రాష్ట్రంలో బిజెపి 20 ఎంపీస్థానాలను గెలవడం టార్గెట్ గా పెట్టుకోవాలని షా దిశానిర్దేశం చేశారు. ఏపీలో వారి పార్టీకి ఏమాత్రం బలం లేదనే సంగతి వారందరికీ తెలుసు. కానీ 25 సీట్లున్న రాష్ట్రంలో 20 కంటె ఎక్కువ గెలవాలనే లక్ష్యాన్ని ఎలా అనగలిగారు అనేది ఆశ్చర్యం. అక్కడే పొత్తుల గురించిన అనుమానాలు పుడుతున్నాయి. తెలుగుదేశం ఇప్పటికే బిజెపితో పొత్తుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఒకవైపు పవన్ కల్యాణ్, జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని ఢంకా బజాయించి చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయి వచ్చారు. వీటిని సమన్వయం చేసుకుంటే.. ఒకవేళ పొత్తులు కుదిరే అవకాశం ఉంటే బిజెపి వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు కావాలని డిమాండ్ చేస్తుందనే వాదన వినిపిస్తోంది. 20 సీట్లు అనేది కొంచెం అతిశయంగా అనిపించినప్పటికీ.. కనీసం పది ఎంపీ సీట్లు ఇవ్వాలనే డిమాండ్ తో బిజెపి పొత్తుల చర్చలు జరపవచ్చునని అనుకుంటున్నారు. ఎమ్మెల్యే సీట్ల విషయంలో అంతగా పట్టింపు ఉండదని అనుకుంటున్నారు.
బిజెపి పొత్తు తప్పనిసరిగా కావాలని అనుకుంటే గనుక.. చంద్రబాబునాయుడుకు వేరే గతిలేదు. అలాగని ఆయనకు పెద్ద నష్టం కూడా లేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినది కేవలం మూడే ఎంపీ సీట్లు. తెలుగుదేశం హవా నడిచిందని అనుకునే 2014 ఎన్నికల్లో కూడా వారు గెలిచినది 16 మాత్రమే. ఈసారి ఎన్నికలు జరిగినా వారికి పెద్ద హోప్ లేదు.
అందుకే.. వ్యూహాత్మకంగా ఎక్కువ పార్లమెంటు సీట్లను బిజెపికి అప్పగించేసి, పొత్తులు కుదుర్చుకుంటే లాభం అని బాబు అనుకోవచ్చు. అందుకే.. అమిత్ షా 20 ఎంపీ సీట్లు గెలవాలనే మాటలు.. పొత్తులు కుదిరేట్లయితే బిజెపి పెట్టగల ప్రతిపాదనకు సంకేతాలు అని పలువురు భావిస్తున్నారు.