అనకాపల్లి ఎంపీ సీటు మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తమకే ఖాయం అని కూడా భావించారు. అయితే అనూహ్యంగా రేసులోకి దూసుకుని వచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచి తీరాలని ఆయన పట్టుదలగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
టీడీపీ జనసేన పొత్తులో ఈ సీటు జనసేనకు ఇస్తారని అన్నీ ఆలోచించి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేనలో చేరారు. ఇపుడు ఆయన మద్దతుని నాగబాబు కోరడానికి ఆయన ఇంటికి వచ్చి వెళ్లారు. ఇదే సీటు మీద ఒక పారిశ్రామికవేత్త కన్ను కూడా ఉంది. ఆయన తనకే సీటు ఇస్తారని ఆశపడ్డారు. రెండు పార్టీల వైపు నుంచి పెద్దలతో ఉన్న మంచి పరిచయాలు కారణంగా ఈ సీటు తనకే అని నమ్మకంగా ఉన్నారు. ఇపుడు ఆయన కూడా ఆలోచనలో పడ్డారని భోగట్టా.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఈ సీటు నుంచి పోటీ చేయాలని నాలుగేళ్ళ ముందే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. తన కొడుకు కోసం అయ్యన్న కూడా తీవ్ర ప్రయత్నం చేశారు అని ప్రచారం సాగింది.
విజయవాడకు చెందిన టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇదే సీటు కోసం చంద్రబాబుని కోరుతున్నారు. సీబీఎన్ జిందాబాద్ అని తన రక్తంతో రాసి ఆయన బాబు మెప్పు పొందేందుకు చూస్తున్నారు. బాబు నిర్ణయం తనకు అనుకూలంగా ఉంటుందని బుద్ధా వెంకన్న ధీమాగా ఉన్నారు.
ఇపుడు రేసులోకి మరో నేత వచ్చారు. ఆయన తెలుగుదేశం యువ నాయకుడు ఆడారి కిశోర్ కుమార్. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో సమస్యలు మొత్తం తెలుసు. నేను ఇక్కడే పుట్టా పెరిగా చదువుకున్నాను అని ఆయన చెబుతున్నారు.నాకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే యువకుడిగా తన సత్తా ఏమిటో చూపిస్తాను అని అంటున్నారు.
ఇంతమంది పోటీ పడుతున్న ఎంపీ సీటు ఏపీలో అనకాపల్లి తప్ప మరొకటి ఉండదేమో. ఈ సీటును పట్టుకుంటే సునాయాసంగా పార్లమెంట్ లో అడుగుపెట్టవచ్చు అన్నది నేతల ఆలోచన. జనసేన నాగబాబుకు ఈ సీటు ఇస్తే వీరంతా సహకరిస్తారా అన్నదే ఇపుడు ఆసక్తిని రేపుతున్న విషయం.