బాబు పవన్ కాకుండా ఆయన కూడా సీఎం?

తెలుగుదేశం- జనసేన పొత్తులో సీఎం పోస్టు కూడా పంచుకోవాలని కాపు నేతలు ఒక వైపు డిమాండ్ చేస్తున్నారు. అన్ని విషయాల్లో షేరింగ్ ఉండాలని వారు కోరుకుంటున్నారు. బీజేపీ కూడా ఈ పొత్తులోకి ఎంటర్ అయితే…

తెలుగుదేశం- జనసేన పొత్తులో సీఎం పోస్టు కూడా పంచుకోవాలని కాపు నేతలు ఒక వైపు డిమాండ్ చేస్తున్నారు. అన్ని విషయాల్లో షేరింగ్ ఉండాలని వారు కోరుకుంటున్నారు. బీజేపీ కూడా ఈ పొత్తులోకి ఎంటర్ అయితే ఎన్ని చిత్రాలు జరుగుతాయో ఇంకా  తెలవాల్సి ఉంది.

ఇపుడు చినబాబు వంతు అన్నట్లుగా ఉంది అంటున్నారు. శంఖారావం పేరుతో లోకేష్ నిర్వహిస్తున్నా సభలలో విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెందుర్తిలో జరిగిన సభలో కొంతమంది ఉత్సాహవంతులు సీఎం లోకేష్ అంటూ నినాదాలు చేయడంతో రాజకీయ కలకలం రేగింది.

లోకేష్ సభలలో జై చంద్రబాబు అనే నినాదాలు వినిపిస్తాయి. మన సీఎం బాబు అనే స్లోగన్స్ ఇస్తారు. కానీ లోకేష్ సీఎం అని నినాదాలు ఇవ్వడంతో చినబాబు కూడా లైన్ లోకి వస్తున్నారా అన్న కొత్త సందేహాలు ఏర్పడుతున్నాయి.

తెలుగుదేశం విషయానికి వస్తే చంద్రబాబు మూడు సార్లు సీఎం గా చేసారు. ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తే అయిదేళ్ల కాలంలో చివరలో అయినా లోకేష్ కే పట్టం కడతారు అని ప్రచారం కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కి సీఎం పోస్టు ఇవ్వాలని కాపుల నుంచి డిమాండ్ వస్తూండడంతో పూర్తి స్థాయి పదవీకాలంలో బాబు ఉంటారు అని చెప్పుకొస్తున్నారు.

తెలుగుదేశం కూటమిలో మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా మెజారిటీ టీడీపీకి వస్తే మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని నడపవచ్చు. అపుడు లోకేష్ కి కచ్చితంగా చాన్స్ ఉంటుంది అన్న ప్రచారమూ ఉంది.

కూటమిలో ఇప్పటికే బాబు పవన్ సీఎంలు అని ఆయా పార్టీల శ్రేణులు నినదిస్తూంటే లోకేష్ సీఎం అని కొత్త నినాదం రావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. లోకేష్ ఏ విధంగా చూసినా టీడీపీలో వెయిటింగ్ సీఎం గానే చెబుతారు. కానీ ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు ఉండగా లోకేష్ సీఎం అని నినదిస్తే అది కూటమికే ఎసరు పెడుతుందని అంటున్నారు.