నెల్లూరు జిల్లాలో రెండు బ్యారేజీలు ప్రారంభోత్సవాలకి రెడీగా ఉన్నాయంటూ ఈమధ్య వరుసపెట్టి ప్రకటనలు వచ్చాయి. అందులోనూ ఇటీవల సీఎం జగన్ నెల్లూరు వచ్చినప్పుడల్లా ఈ రెండు బ్యారేజీల ప్రారంభోత్సవాలపై ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చేశారు, డెడ్ లైన్లు పెట్టేశారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పనులు జరగలేదు. పూర్తికాలేని పరిస్థితుల్లో సీఎం జగన్ కు తప్పుడు సమాచారం ఎందుకిచ్చారంటూ జిల్లా ఐఏబీ (ఇరిగేషన్ ఎడ్వైజరీ బోర్డ్) మీటింగ్ లో నిలదీశారు ఆనం రామనారాయణ రెడ్డి. పరోక్షంగా జలవనరుల శాఖ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తనకున్న అక్కసుని ఇలా వెళ్లగక్కారు.
నెల్లూరు వైసీపీలో ఆనంకు తొలి నుంచీ అసంతృప్తవాదిగానే పేరుంది. ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి పోవడం, ఆ స్థానంలో ఆనం వర్గానికి దగ్గరగా ఉన్న కాకాణికి పదవి రావడంతో ఆనం మరింత వయొలెంట్ గా మారారు.
ఐఏబీ మీటింగ్ లో ఆయన తన పాత స్టైల్ లోనే అధికారులపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలులో వెనకబడ్డామని, ఎక్కడికక్కడ కాల్వలు, చెరువులకు సంబంధించిన మరమ్మతు పనులు ఆగిపోయాయని, మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు.
ఆనం చేసిన ప్రతి విమర్శ, పరోక్షంగా మాజీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ పై సంధించినవే. కాకాణి హయాంలో అయినా జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆనం.
అనీల్ ను టార్గెట్ చేస్తూ ఆనం తప్పుల్ని ఎత్తి చూపినప్పటికీ.. అవన్నీ నిజాలేననే భావన అటు ప్రజల్లోనూ ఇటు నాయకుల్లోనూ ఉంది. ఇలా కుండబద్దలు కొట్టేవారే ఈ దశలో కావాలి. లేకపోతే అతి విశ్వాసం కొంప ముంచుతుంది. మూడేళ్లలో ఏం జరిగింది, వచ్చే రెండేళ్లలో ఏం జరగాలి అనేది తేలాల్సి ఉంది.
పదే పదే నెల్లూరు ప్రాజెక్ట్ లపై అధికారులు చెబుతున్న డెడ్ లైన్లనే సీఎం జగన్ వల్లె వేస్తున్నారు కానీ, అసలు ఎందుకా పనులు ఆలస్యమవుతున్నాయనే విషయంపై ఆయన దృష్టి పెట్టలేదని అర్థమవుతోంది.
జలవనరుల శాఖ మంత్రి నెల్లూరు వాసి అయినా కూడా మూడేళ్లుగా బ్యారేజీలు పూర్తి కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించిన తర్వాత కూడా పనులు నత్తనడకన సాగుతుంటే తప్పెవరిది. ఈ విషయాన్నే ఆనం తప్పుబట్టారు. అధికారులు, కొందరు నాయకులు ఏకంగా సీఎం జగన్ నే తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.