నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రతరమైంది. ప్లెక్సీల రగడ చినికి చినికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తమ పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి ప్లెక్సీ చించివేతపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు, నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డి గట్టి హెచ్చరిక చేశారు. తమ పెదనాన్న ప్లెక్సీపై చేయి వస్తే చేతిని నరుకుతామని సంచలన హెచ్చరిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవాళ ఏసీ సుబ్బారెడ్డి జయంతి సందర్భంగా ఏసీ సెంటర్‌లో కుటుంబ సభ్యులు కార్యక్రమం చేపట్టారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఇదిలా ఉండగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుట్టిన రోజు పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గత రాత్రి కొందరు గుర్తు తెలియని చించేశారు. అలాగే ఏసీ సుబ్బారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఏసీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను కూడా ధ్వంసం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తామంతా వైఎస్ కుటుంబ సభ్యులమే అన్నారు. తనకు నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా పని చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పించారన్నారు. అలాగే తన భార్య ఆనం అరుణమ్మ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అని గుర్తు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీని చించివేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. వేమిరెడ్డి సంతోషంగా పుట్టిన రోజు జరుపుకోకుండా, ఏమిటీ బాధ పెట్టే పనులని ప్రశ్నించారు. వేమిరెడ్డి ఎప్పుడూ తొడలు చరచలేదని, మీసాలు తిప్పలేదని గుర్తు చేశారు.
ఇక తమ పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి ప్లెక్సీని చించివేయడాన్ని ఆయన నిలదీశారు. 50 మంది కాదు, వంద మంది వచ్చి ప్లెక్సీలను చించడానికి ప్రయత్నించినా చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అడ్డం పడకుండా ఊరుకుంటామా? అని ఆయన ప్రశ్నించారు. తమ పెదనాన్న ప్లెక్సీని చించివేస్తుంటే, వంద మంది వచ్చారని, అశక్తులమని దండం పెట్టి పక్కకు పోతామా? అని నిలదీశారు. ప్రాణమైనా ఇస్తామని అన్నారు. చెయ్యి తాకినోడి చెయ్యి నరికేస్తామని ఘాటుగా హెచ్చరించారు. మర్యాద ఉండాలని కోరారు. మనం చేసే పనేంటని ఆయన ప్రశ్నించారు.
ఇంత అనుభవం వచ్చింది, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నారని ప్రస్తావించారు. మనం ఇంకా మానసికంగా పెరగక పోతే ఎలా ప్రశ్నించారు. జిల్లాలో పార్టీకి సంబంధించి పది మంది ఎమ్మెల్యేలున్నారని, వారంతా కలిసి పనిచేస్తే సంతోషమన్నారు. ఒకవేళ బేధాభిప్రాయాలు ఉంటే సరి చేసుకోవాలే తప్ప, వాళ్ల అభిమాన నాయకుల వద్దకు వెళుతుంటే ఇబ్బంది పెట్టడం తప్పన్నారు. దయచేసి ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇలాంటి పద్ధతులు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు.
ఒకసారి మనస్సాక్షిగా సద్విమర్శ చేసుకోవాలని కోరారు. ప్లెక్సీలను తగలడం వల్ల ఏమీ రాదన్నారు. అందరూ బాగుండాలని అన్నారు. మీ ప్లెక్సీలు ఎక్కడున్నా తాము తాకమన్నారు. తమ ఎమ్మెల్యేలుగా, నాయకులుగా గౌరవిస్తామన్నారు.