నెల్లూరు జిల్లాలో తాజా మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాకాణి మంత్రి పదవి చేపట్టిన తర్వాత నెల్లూరుకు వచ్చిన సందర్భంలో ఆయన అభినందన ర్యాలీకీ పోటీగా అనిల్ ఆత్మీయ సభ పేరుతో నగరం నడిబొడ్డున స్టేజ్ కట్టడం విమర్శలకు తావిచ్చింది.
సొంత పార్టీలోనే ఈ స్థాయిలో విభేదాలుంటాయా అని అనుకున్నారంతా. గతంలో తాను మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు కాకాణి తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయతను రెట్టింపు స్థాయిలో తిరిగిచ్చేస్తానంటూ పరోక్షంగా అనిల్ సెటైర్స్ వేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై మంత్రి కాకాణి చాలా కూల్ గా స్పందించారు.
అనిల్ అన్నదాంట్లో తప్పేముందని మీడియాని ఎదురు ప్రశ్నించారు కాకాణి. అనిల్ రెట్టింపు సహకారం ఇస్తామన్నారు దాంట్లో తప్పేముందని అన్నారు. తమ మధ్య ఉన్న సహాయ సహకారాలు మీడియాకు తెలియవు కదా అని ప్రశ్నించారు. తామెప్పుడూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటామని చెప్పారు. అనిల్ తనకు రెట్టింపు సహకారం ఇస్తామన్న మాటలను స్వాగతిస్తున్నానని, అలా రెట్టింపు ఇస్తే తనకు సంతోషమేనన్నారు కాకాణి.
ఇక మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం రోజు తనకు కాకాణి నుంచి ఆహ్వానం అందలేదని కూడా అనిల్ కుమార్ యాదవ్ కామెంట్ చేశారు. దీనికి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు కాకాణి. తాను అందరినీ ఆహ్వానించానని, ఆహ్వానం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేదని, అది వ్యక్తిగత విషయం అని దాని గురించి బయట మాట్లాడనన్నారు. కొన్ని కారణాల వల్ల ఫోన్లు కలవకపోవచ్చని, మెసేజ్ చేరి ఉండకపోవచ్చని చెప్పారు.
ఫ్లెక్సీల విషయంలో రాద్ధాంతం ఎందుకు..?
ఇటీవల నెల్లూరులో కాకాణి ఫ్లెక్సీలు చించేశారంటూ రాద్ధంతం జరిగింది. అయితే దానిపై సూటిగా స్పందించారాయన. కాకాణి వెళ్లి అనిల్ ఫ్లెక్సీని చించేయరు కదా, అలాగే అనిల్ వచ్చి కాకాణి ఫ్లెక్సీని ధ్వంసం చేయరు కదా అని అన్నారు. గిట్టనివారు తమ మధ్య గ్యాప్ ని పెంచేందుకు ప్రయత్నిస్తుంటారని, అది సంఘవిద్రోహ శక్తుల పని అయి ఉంటుందేమోనని చెప్పారు. ఫ్లెక్సీ వివాదాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నారు కాకాణి.
ఇలా అనీల్ కుమార్ వీరావేశంతో వేసిన సెటైర్లకు, కాకాణి కూల్ గా కౌంటర్లు వేశారు. రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందోనని వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.