టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఏ పనీ లేనట్టుందనే విమర్శలొస్తున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను తలచుకోనిదే ఆమె దినచర్య ప్రారంభమయ్యేలా లేదు. మాధవ్ ఆలోచనలతో ఆమె నిద్రపోతున్నారో, లేదో అనే సానుభూతి కూడా వ్యక్తమవుతోంది. మాధవ్ ఎపిసోడ్ ఆమెకు మహా ఉత్సాహాన్ని, మైలేజీని ఇచ్చాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మాధవ్ వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటన, ఆ తర్వాత ఎంపీ ఘాటు రియాక్షన్ వెలువరించిన సంగతి తెలిసిందే. వీటిపై నారా లోకేశ్, బొండా ఉమా తదితర టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈమె రియాక్షన్ మాత్రం రాలేదు. దీంతో ముందు నుంచి మాధవ్ ఎపిసోడ్‌పై విమర్శలకు నాయకత్వం వహిస్తున్న వంగలపూడి అనిత ఎక్కడనే ప్రశ్న వచ్చింది.
ఈ నేపథ్యంలో లేట్‌గా అయినా లేటెస్ట్‌గా అనిత మీడియా ఎదుట ఎంట్రీ ఇచ్చారు. వీడియోలో ఉన్నది గోరంట్ల కాదని ఎస్పీ స్పష్టంగా చెప్పలేదని అనిత వాపోయారు. రికార్డింగ్ చేసిన వీడియో తీసుకురావాలని ఎస్పీ చెబుతున్నారని, అయితే మాధవ్ సెల్‌ఫోన్‌ను ఎందుకు సీజ్ చేయలేదని అనిత ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాధవ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
గోరంట్ల వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ వ్యవహారంపై గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తామన్నారు. గోరంట్ల మాధవ్‌ను బర్తరఫ్ చేసే వరకు తమ పోరాటం ఆగదని వీర విప్లవ నాయకురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు.
మాధవ్ ఎపిసోడ్‌పై ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కవ ప్రచారం పొందొచ్చనే యావతోనే అనిత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అనిత కోరుకున్నట్టు అనంతపురం ఎస్పీ చెప్పాలా? అని ప్రశ్నిస్తున్నారు. గోరంట్ల ఏం చేయాలో కూడా అనితే చెప్పేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయినా ఏ సమస్యలూ లేనట్టు మాధవ్‌ను పట్టుకుని అనిత ఏం సాధిస్తారనే ప్రశ్నలొస్తున్నాయి.
మాధవ్ ఎపిసోడ్‌లో ప్రభుత్వ వైఖరి తెలిసిన తర్వాత కూడా అనిత రాద్ధాంతం చేస్తున్నారంటే, ఆమెకు పబ్లిసిటీ యావ తప్ప మరే ఆశయం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపం మాధవ్ ఆలోచనలతో ఆమె నిద్రైనా పోతున్నారో లేదో అనే సెటైర్స్ పేలుతున్నాయి. ఏదైనా శ్రుతిమించితే ఇలాగే వుంటుంది మరి!