ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల కథనం మేరకు… వైఎస్ విజయమ్మ కర్నూలులో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లారు. ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యంలో అనంతపురం జిల్లా గుత్తి వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళన చెందారు. కారు పక్కకు వెళ్లిపోయింది. అయితే కారులో ఉన్న విజయమ్మకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం. మరోకారులో ఆమె హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఈ ఘటనలో విజయమ్మ సురక్షితంగా బయటపడడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ ప్లీనరీలో గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణలో పోరాడుతున్న తనయ షర్మిల కోసం అక్కడికి వెళ్లాల్సిన తప్పని సరి పరిస్థితి వచ్చిందన్నారు. రాజీనామా చేస్తున్నందుకు అందరికీ ఆమె క్షమాపణ కూడా చెప్పారు. ప్లీనరీ తర్వాత ప్రమాదానికి సంబంధించి ఆమె వార్తల్లో కనిపించారు.