పెట్టుబడులు ఉంటేనే ఎక్కడైనా పని జరిగేది. ఎవరైనా కూడా పైసాతోనే పరమాత్మను చూస్తారు. ఒక రాష్ట్రం అయినా దేశం అయినా అభివృద్ధి చెందింది అని చెప్పాలీ అంటే డబ్బులనే కొలుస్తారు. ఏపీలో మూడేళ్ళ పాలనను మూడు నెలల క్రితం పూర్తి చేసుకున్న జగన్ సంక్షేమ రాజ్యానికి కేరాఫ్ గా పాలన చేశారు.
ఇపుడు ఆయన రెండవ వైపు చూస్తున్నారు. ఏపీ ప్రగతిబాటన నడవాలి అంటే పెట్టుబడులు రావాలి. అందుకే దావోస్ వెళ్ళి వచ్చారు. అక్కడ అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అవి మెటీరియలైజ్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోగా భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సునకు వైసీపీ సర్కార్ సంకల్పిస్తోంది.
దానికి విశాఖను వేదికగా ఎంచుకున్నారు. విశాఖ వంటి రెడీ మేడ్ సిటీని పారిశ్రామికవేత్తల ముందు పెట్టి పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏపీకి తీసుకురావలని ఒక గట్టి ప్రయత్నమే జరుగుతోంది. ఇప్పటికే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. అయితే అవి చాలినంతగా లేవు. దాంతో ఈసారి ప్రతిష్టగా భావించి ప్రభుత్వం పెట్టుబడుల సదస్సునే వైజాగ్ లో నిర్వహించాలనుకుంటోంది.
దీనికి దేశీయ విదేశీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లుగా చెబుతున్నారు. తొందరలోనే డేట్ టైమ్ ఫిక్స్ చేసి విశాఖ నుంచే ఏపీ తన పెట్టుబడుల రాబట్టే యాగానికి శ్రీకారం చుట్టనుంది. గతంలో అంటే టీడీపీ హయాంలో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సులు కొన్ని జరిగాయి. ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా వచ్చాయి.
అయితే ఈసారి అలా కాకుండా పూర్తిగా వాస్తవాలను గుర్తిస్తూ ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ అంతా పారదర్శకంగానే ఉండేలా పెట్టుబడుల సదస్సుని నిర్వహించాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది అంటున్నారు. విశాఖలోనే భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమరనాధ్ ఉన్నారు. దాంతో వైసీపీ ఫస్ట్ టైమ్ నిర్వహిస్తున్న ఈ సదస్సు సక్సెస్ ఫుల్ అవుతుందని అంటున్నారు.