ఉత్తరాంధ్రాలోనే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా ఉన్న ఏయూకి వరసగా రెండు సార్లు ఉప కులపతి పోస్ట్ దక్కించుకోవడం అంటే అరుదైన విషయమే. అలాంటి రేర్ ఫీట్ ని ప్రసాదరెడ్డి సాధించారు. ఆయన ఏయూకి రెండవసారి వీసీగా నియమితులయ్యారు. ఆయన మొదటి టెర్మ్ లోనే తన పనితీరుతో రుజువు చేసుకున్నారు. ఏయూ అభివృద్ధిని పెద్ద ఎత్తున చేయడమే కాకుండా విదేశీ విద్యార్ధులు కూడా ఏయూ వైపు చూసేలా చేశారు.
ఏయూలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. ఏయూలో క్యాంపస్ ఇంటర్వ్యూలు పెరిగాయి. ఎంతో మందికి ప్లేస్ మెంట్స్ వచ్చాయి. ఏయూ స్థలాలు పరిరక్షణ జరిగింది. ఏయూ ఖ్యాతి కూడా బాగా పెంచగలిగారు. దాంతో ఆయనకు వైసీపీ ప్రభుత్వం మరోసారి చాన్స్ ఇచ్చింది. ఏయూ వీసీకి అభినందనలు ఒక వైపు అందుతూంటే విపక్షాలు అయితే ఆయనకు మరోసారి చాన్స్ ఇవ్వడం పట్ల విమర్శలు చేస్తున్నాయి.
ఇలా పదవీ బాధ్యతలు స్వీకరించారో లేదో అలా దిగిపోవాలని విద్యార్ధి సంఘాలు గోల మొదలెట్టేశాయి. ఏయూ వీసీగా ప్రసాదరెడ్డిని తొలగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. ఏయూ ప్రతిష్టను ఆయన దిగజార్చారని మండిపడుతోంది. గవర్నర్ జోక్యం చేసుకుని ఆయన్ని తప్పించాలని కోరుతోంది.
ఎవరేమనుకున్నా వీసీగా రెడ్డి గారికి మంచి మార్కులే పడ్డాయి. దాంతోనే ఆయన్ని మరోసారి నియమించారని అంటున్నారు. మూడేళ్ళ పాటు ఈ పదవిలో ప్రసాదరెడ్డి కొనసాగనున్నారు. ఏయూని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముందు నిలబెట్టడం వల్లనే తనకు మళ్లీ వీసీగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పారు.
ఏయూలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టామని మారుతున్న కాలానికి తగినట్లుగా అత్యాధునిక కోర్సులతో ఏయూని అగ్ర స్థానంలో నిలబెట్టామని చెప్పారు. ఈసారి తన బాధ్యత మరింతగా పెరిగిందని పూర్తి స్థాయిలో ఏయూ ప్రగతికి కృషి చేస్తానని ప్రసాదరెడ్డి అంటున్నారు.