కొణతాల అయోమయ రాజకీయం…!

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ రాజకీయం అయోమయంగా ఉందని అంటున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలసి వచ్చారు. ఆ తరువాత జనసేనలో చేరడం ఖాయం…

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ రాజకీయం అయోమయంగా ఉందని అంటున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలసి వచ్చారు. ఆ తరువాత జనసేనలో చేరడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఈలోగా ఆయన ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న వైఎస్ షర్మిలను కూడా కలిశారు.

దాంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అన్నది తెలియడంలేదు. కొణతాలకు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అనకాపల్లి సీటు జనసేనకు పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఇచ్చినా ఆ సీటు కోసం జనసేనలో కాపు నేతలు చాలా మంది కర్చీఫ్ వేసి ఉన్నారని అంటున్నారు.

తెలుగుదేశం లో చూస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు ఆ సీటు కోరుతున్నారు. కొత్తగా ఒక పారిశ్రామికవేత్త కూడా టీడీపీకి టచ్ లోకి వచ్చారు. దాంతో కొణతాల ఎందుకైనా మంచిదని వైఎస్ షర్మిలను కూడా కలిశారు అని అంటున్నారు.

తాను ఏ పార్టీలో చేరేది తొందరలో చెబుతాను అని కొణతాలా తాజాగా ప్రకటన విడుదల చేయడంతో ఆయన జనసేనలో చేరడం లేదా అని అనుచరులతో పాటు అంతా ఆలోచిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం యువకుడిగా రాజకీయం మొదలెట్టిన కొణతాల లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఈనాటి రాజకీయం దూకుడుగా సాగుతోంది. పైగా చాలా లెక్కలు ఉన్నాయి. ఒకనాటి రాజకీయ వైభవం చూపించి ఇప్పుడు నెట్టుకురావాలంటే కష్టతరం. చాలా వరకూ రాజకీయ పార్టీలు కొత్త ముఖాల వేటలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ రూపంలో ఒక ఆప్షన్ అయితే అందరికీ ఉంది. దాంతో కొణతాలకు అక్కడ అయితే చాన్స్ ఉందని అంటున్నారు. కొణతాల మాత్రం ఇంకా ఏదీ నిర్ణయించుకోకపోవడంతో ఆయన రాజకీయం ఎలా సాగుతుందో తెలియక అనుచరులు తికమక పడుతున్నారు.