పవన్ కల్యాణ్ సాధారణంగా తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. అయితే గియితే తాను గొప్ప నటుడిని అనే భ్రమల్లో ఆయన ఉంటే పరవాలేదు. ఆయన సొంత రంగం. ఆయనకు ఒక స్థాయి ఉంది. కానీ తాను జ్ఞానిని అని కూడా ఆయన అనుకుంటేనే ప్రమాదం.
తాజాగా ఓటరు జాబితా తనిఖీ వ్యవహారాల్లో.. వాలంటీర్లు పాల్గొనడం చట్టవిరుద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు. ఓటర్ల జాబితాల తనిఖీ విషయంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయో.. బహుశా పవన్ కల్యాణ్ కు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదని అనుకోవాలి.
ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని పాలక, ప్రతిపక్షాలు ఇద్దరూ అంటూనే ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని ఏరిపారేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తెలుగుదేశం నాయకులు కూడా కొన్ని చోట్ల జాబితాల్లో దొంగఓట్లు నమోదై ఉన్న సంగతులను ఆధారాల సహా బయటపెట్టి యాగీ చేశారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. వీటిమీద స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితాల తనిఖీకి ఆదేశించింది. డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి తనిఖీ చేయాలని కూడా నిర్దేశించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ గోల చేస్తున్నది కూడా ఈ విషయం గురించే.
ఓటరు జాబితాల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్టవిరుద్ధం అని ఆయన అంటున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం చట్టం ఉన్నదో ఆయనకు మాత్రమే తెలిసినట్టుగా ఉంది. ఓటరు జాబితాల తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు అంతా నిష్పక్షపాతాం పాదర్శకంగా జరగాలని అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం అని పవన్ సుద్దులు చెబుతున్నారు. అదే సమయంలో జాబితాల తనిఖీలో బూత్ లెవెల్ అధికారులతో పాటూ వైసీపీ నేతలు వాలంటీర్లు వెళుతున్నారని.. ఇది తప్పు అని పవన్ చెబుతున్నారు.
ఈ నీతులు ఓకే గానీ.. జాబితాల తనిఖీకి స్థానిక పార్టీలకు నోటీసు ఇచ్చి వారి ఏజంట్లు వచ్చినట్లయితే వారి సమక్షంలోనే తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘమే ఆదేశించింది. అనుమానం ఉన్నచోట్ల ఈ జాబితాల తనిఖీలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొంటారు.
అయినా క్షేత్రస్థాయిలో పార్టీ నెట్వర్క్ ఉన్నవారికే ఇవన్నీ అర్థమవుతాయి. ఏదో సభలు పెట్టి రంకెలు వేయడం, ఆందోళనల పేరుతో బూతులు తిట్టడం తప్ప మరేమీ తెలియని పార్టీ అధినేతకు.. క్షేత్రస్థాయిలో పార్టీకి యంత్రాంగం ఉంటుందని, వారు ఓటరు జాబితాలను ఎఫ్పటికప్పుడు పరిశీలిస్తూ ఏదైనా తేడాలు వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తారని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించదు.