ఇంకో చీలికకోసం కమలం కత్తులు నూరుతోందా?

భాజపాయేతర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో మనుగడలో ఉంటే చాలు.. ప్రత్యేకించి ఆయా ప్రభుత్వాలు తమకు లోబడి ఉండే, తమతో సానుకూలంగా మెలిగే తరహా కాకపోతే చాలు.. ఆయా ప్రభుత్వాలను కుప్ప కూల్చేయడానికి కమలం పార్టీ కంకణం…

భాజపాయేతర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో మనుగడలో ఉంటే చాలు.. ప్రత్యేకించి ఆయా ప్రభుత్వాలు తమకు లోబడి ఉండే, తమతో సానుకూలంగా మెలిగే తరహా కాకపోతే చాలు.. ఆయా ప్రభుత్వాలను కుప్ప కూల్చేయడానికి కమలం పార్టీ కంకణం కట్టుకుందా? దేశమంతా, అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ పతాక రెపరెపలు మాత్రమే కనిపించాలని వారు అనుకుంటున్నారా? మరొక పార్టీని బతకనివ్వరా? అదే సింగల్ పాయింట్ ఎజెండాతో వారు ప్రభుత్వంలో ఉన్న పార్టీలను చీల్చడానికి ప్రయత్నిస్తుంటారా? 

ఇటీవలి కొన్ని పరిణామాలు మాత్రం.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తాయి. అలాగే.. తాజాగా జార్ఖండ్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ సమీకరణలు.. కమలం కొత్తగా మరో చీలిక తేవడానికి, కత్తులు నూరుతున్నదనే అనుమానాల్ని కూడా కలిగిస్తాయి. 

జార్ఖండ్ లో హేమంత్ సొరెన్ ప్రభుత్వం కష్టాల్లో ఉంది. అవినీతి ఆరోపణలకు సంబంధించి.. జార్ఖండ్ ముక్తిమోర్చాకు చెందిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే జరిగితే ఈ ప్రభుత్వం పడిపోతుంది. అలాంటి పరిస్థితే వస్తే గనుక, ఆ సందర్భాన్ని, ఆ సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఉండగల ఒత్తిడిని అదనుగా తీసుకుని.. పార్టీని చీల్చడానికి కమలం పార్టీ ప్రయత్నించే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. అధికారిక ప్రకటన లేదు గానీ.. హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసినట్లు వార్తలు వస్తుండడంతో ఇదంతా జరుగుతోంది.

చీలిక భయంతో.. పార్టీ ఎమ్మెల్యేలందరినీ హేమంత్ సోరెన్ బస్సులో క్యాంపుకు తరలించడం ఇక్కడ తాజా అప్డేట్. ఛత్తీస్ గడ్ లోని ఒక రిసార్టుకు సీఎం స్వయంగా బస్సులో, తానే కండక్టరు సీట్లో కూర్చుని.. తీసుకువెళ్లడం అక్కడ వారిని కట్టుతప్పకుండా కాపాడుకోవడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ది మైనారిటీ ప్రభుత్వమే. 81 సీట్లున్న జార్ఖండ్ లో వారి పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 18 మంది ఉన్న కాంగ్రెస్, ఒక్కరున్న ఆర్జేడీలతో కలిసి ప్రభుత్వం నడుపుతున్నారు. బిజెపికి 26 మంది బలం ఉంది. పాలక పార్టీల్లో 16 మందిని చీలిస్తే.. బిజెపి అధికారంలోకి వస్తుంది. 

ముంబాయి రాజకీయాల తరహాలో.. జార్ఖండ్ లో కూడా అధికారం హస్తగతం చేసుకోవడానికి జెఎంఎంను చీల్చడానికి బిజెపి ప్రయత్నిస్తుందని ఆ పార్టీ భయపడుతోంది. అందుకే క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సొరెన్ ఇప్పుడు ఇలా వారిని తన జట్టులో కాపాడుకోవచ్చు గానీ.. ఆయన శాసనసభ్యత్వం రద్దు కావడం అనే మాట నిజమే అయితే గనుక.. పార్టీ మొత్తం కకావికలు అవుతుందనడంలో సందేహం లేదు.