రాష్ట్రంలో సీపీఎస్ రద్దుకోరుతున్న ఉద్యోగుల గొడవ హాట్ టాపిక్ గా మారుతున్న తరుణంలో.. దానిద్వారా కూడా వీలైనంత మైలేజీ తెచ్చుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెగబడుతున్నారు. వారికోసం తన జమానాలో చేసిన న్యాయం ఏమీ లేదుగానీ.. ఇప్పుడు వారి గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగుల మీద వేధింపులు మానుకోవాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి హితవు చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని విమర్శలు వస్తున్నాయి.
2003లో కేంద్రప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చింది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరే వారికి దీన్ని అమల్లోకి తెచ్చింది. ఇదే స్కీమ్ ను రాష్ట్రాల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పథకం ఉద్యోగుల్లో వ్యతిరేకతకు బీజంవేసేదిగా ఉండడంతో.. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు దీనిని పట్టించుకోలేదు. వాజపేయి సర్కారుకు చంద్రబాబు అప్పట్లో అనుకూలంగానే ఉన్నారు గానీ.. ఈ విధానాన్ని అమలు చేయలేదు. రాష్ట్రంలో అమలు చేస్తే వ్యతిరేకత వస్తుందని భయపడ్డారు. అయినాసరే ప్రజలు ఆయనను ఎన్నికల్లో ఓడించారు.. అది వేరే సంగతి!
ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది. ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉన్నా.. దీని జోలికి వెళ్లలేదు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్, కొత్తగా దీనిని ఇక్కడ కూడా అమలు చేశారు. సెప్టెంబరు 1నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి అంతో ఇంతో నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల వ్యతిరేకత ఉన్నా.. 2009 ఎన్నికలను కూడా వైఎస్ఆర్ గెలిచారు.
2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక దీని గురించి పట్టించుకోలేదు. ఆయనకు నిజంగా ఉద్యోగుల మీద ప్రేమ ఉంటే.. వైఎస్ఆర్ తెచ్చిన ఈ విధానాన్ని వెనక్కు తీసుకుని పాత విధానం పెట్టేసి ఉంటే సరిపోయేది. వైఎస్సార్ కంటె చంద్రబాబు చాలా మంచోడు అనే కీర్తి కూడా ఆయనకు దక్కేది. కానీ.. చంద్రబాబు దాని జోలికి వెళ్లనేలేదు.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు మాత్రం.. సీపీఎస్ ఉద్యోగులను వేధించొద్దు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జగన్ వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారని, దానిని నమ్మి వారు ఓట్లు వేశారని అంటున్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని అంటున్నారు. ఈ పోచికోలు కబుర్లన్నీ చెబుతున్నారే తప్ప.. సీపీఎస్ మీద తన విధానం ఏమిటో తేల్చి చెప్పడంలేదు.
‘‘తమ్ముళ్లూ రెండేళ్లు ఆగండి.. మన ప్రభుత్వం రాబోతోంది. తొలి సంతకం సీపీఎస్ రద్దు ఫైల్ మీద చేసేస్తా.. మీ కష్టం తీరుస్తా’’ అనే మాట చంద్రబాబు నోటినుంచి రావడం లేదు. ఆయన చాలా తెలివిగా జగన్ మీద నిందలు వేయడానికి మాత్రమే ఈ టాపిక్ వాడుకుంటున్నారు. తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తా అనే హామీ ఆయన ఇవ్వరు. ఇస్తే దొరికిపోతానని, అలా చేయడం సాధ్యం కాదని ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు.
అందుకే ఇలాంటి మెరమెచ్చు మాటలు మాట్లాడకుండా.. సీపీఎస్ ఉద్యోగుల మీద మొసలి కన్నీరు కార్చకుండా.. తమ పార్టీ విధానం ఏంటో, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలని ప్రజలు కోరుతున్నారు.