సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఏపీ అధికార పార్టీ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎన్నికల్లో సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. సీరియస్ పాలిటిక్స్ చేసే ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు సోషల్ మీడియాను శక్తిమంతంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ మరోసారి సోషల్ మీడియాను ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకునేందుకు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటోంది.
ఈ క్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో నియామకాలు చేపట్టింది. వారికి తాడేపల్లిలో ఓ హోటల్లో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించింది. ప్రతి నియోజక, మండల, గ్రామస్థాయిలో సోషల్ మీడియా సైన్యాన్ని నియమించుకోవాలని దిశానిర్దేశం చేసింది. అయితే సమావేశాలు ముగింపు రోజు సెల్‌ఫోన్‌తో కూడిన కిట్‌ను సోషల్ మీడియా సైన్యానికి వైసీపీ అందించినట్టు ఈనాడు పత్రికలో రావడం చర్చనీయాంశమైంది.
కిట్ మాత్రం ఇచ్చారని, సెల్‌ఫోన్‌ను మాత్రం ఈనాడు కార్యాలయానికి వెళ్లి తీసుకుంటామని వైసీపీ సోషల్ మీడియా యాక్టివి స్టులు సెటైర్స్ విసురుతున్నారు. తమకు సెల్ఫోన్లు ఇచ్చేంత సీన్ లేదని అంటున్నారు. తమకు కిట్ ఇచ్చిన మాట వాస్తవమే అంటున్నారు. అందులో ఫ్యాన్ లోగోతో టీ షర్ట్, టోపీ, ఒక టీ కప్పు (జగన్ ఫొటో), ఒక పెన్, ఫ్యాన్ కీ చైన్, నోట్ బుక్, కండువా, వైసీపీ మేనిఫెస్టో మాత్రమే ఇచ్చారని వారు చెబుతున్నారు.
టీ షర్ట్‌పై వైసీపీ సోషల్ మీడియా వారియర్, అలాగే టోపీపై జగన్ సోషల్ మీడియా వారియర్ అని రాశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనుందని, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ పెద్దలు దిశానిర్దేశం చేశారని శిక్షణకు వెళ్లొచ్చిన వారు తెలిపారు.