మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇవాళ కీలక మలుపు తిరిగింది. తన తండ్రి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఇది ఏపీ ప్రభుత్వానికి షాక్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని కోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు చేపట్టేలా సునీత తాను అనుకున్నది సాధించారు.
ఈ కేసులో రెండో దఫా ఆమె న్యాయస్థానం నుంచి సానుకూల తీర్పు పొందడం విశేషం. డాక్టర్ సునీతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడైన సంగతి తెలిసిందే. ఏపీలో సీబీఐ అధికారులనే నిందితులు బెదిరిస్తున్నారని, విచారించే వారిపై ఎదురు కేసులు పెడుతున్నారని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని, కావున విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సునీత వాదనను బలపరిచేలా సీబీఐ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. వేరే రాష్ట్రానికి విచారణను బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఇదే సందర్భంలో నిందితు లైన ప్రతివాదులు ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డిల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అడిగింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని వారిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణకు బదిలీ చేయాలని వారు చెప్పినట్టు సమాచారం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని డాక్టర్ సునీత తరపు న్యాయవాది చెప్పారు. కర్ణాటకకు కేసు విచారణను బదిలీ చేయాలని సీబీఐ తరపు న్యాయవాది విన్నవించారు. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. విచారణ జాప్యంపై సీబీఐని కోర్టు తప్పు పట్టింది.