గుర్రాన్ని నీటి దగ్గర వరకు తీసుకెళ్లడం కష్టం కాదు. నీళ్లు తాగించడమే అసలు కష్టం అన్నది సామెత. పార్టీలు కలిసి పోరాడేందుకు పొత్తులు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ కార్యకర్తలు కలవాలి. ఓట్ల బదిలీ జరగాలి అదే అసలు సిసలు సమస్య.
ఇక్కడే కడుపులో కత్తులు పెట్టుకుని, కావులించుకున్న తీరుగా వుంటుంది వ్యవహారం. అందులోనూ ఒకరి ఓటమి లక్ష్యంగా పెట్టుకునే పొత్తుల దగ్గర మరీ సమస్య. తమ నాయకుడికి సంపూర్ణ న్యాయం, అధికారం సంప్రాప్తిస్తుంది అనుకుంటే అది వేరే సంగతి. అలా కాకుండా అవతలి వారి పల్లకీ మోయడం కోసం పొత్తు అనుకుంటే వేరేగా వుంటుంది. అదీ కాక జనసేన-తెలుగుదేశం పార్టీల పొత్తును రెండుపార్టీల పోత్తుగా కాకుండా రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య పొత్తుగా చూడాల్సి వుంటుంది కూడా. అక్కడే సమస్య మరింత జటిలం అవుతుంది. కమ్మ..కాపు కలిసాయి అంటే బిసి లు ఎటు మొగ్గుతారు అన్నది చూడాల్సి వుంది.
ప్రజలంతా ఏక నిర్ణయంతో జగన్ ను గద్దె దింపాలి అనుకుంటే సేన-దేశం పొత్తు ఫలిస్తుంది. ఫలితాన్నిస్తుంది. అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీగా వుంటే మాత్రం వ్యవహారం సజావుగా నడవదు. పొత్తుకు ముందుగా వచ్చే సమస్య..జనసేనకు ఎన్ని స్థానాలు వస్తాయి అన్నది.
జనసేన మరీ పది ఇరవై సీట్లకు కక్కుర్తి పడితే అది అస్సలు కడుపునింపదు. ఎందుకంటే పవన్ ను ఎంతో ఎక్కువగా ఊహించుకుంటున్న జనసైనికులకు ఇది చాలా అల్పంగా కనిపిస్తుంది. కనీసం నలభై నుంచి యాభై స్థానాలు ఇవ్వాల్సి వుంటుంది. అధికారంలోకి వస్తే పదవుల పంపకం అన్నది వేరే సంగతి.ఇలా యాభై స్థానాలు ఇస్తే అది ఏ ప్రాంతంలో? పక్కాగా ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర అన్నవి కీలకంగా వుంటాయి.
2019 వరకు వీటిలో తెలుగుదేశం కూడా కీలకంగా వుంది. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీని నమ్ముకుని వున్నవారు వున్నారు. జనసేన అక్కడ సీట్లు తెచ్చుకుని, గెలిచి పాతుకుపోతే వీరి రాజకీయం ఏం కావాలి? వైకాపా..దేశం పోటీ వుంటే ఇవ్వాళ కాకుంటే రేపయినా పైకి తేలవచ్చు. జనసేనకు ఇచ్చేస్తే ఇంక ఎలా? ఇలాంటపుడు ఓట్ల బదిలీ అన్నది కష్టం.
తెలివిగా తెలుగుదేశం నుంచి జనసేన లోకి పంపి అక్కడ టికెట్ ఇప్పించుకుంటారు అని అనుకుందాం. అప్పుడు సీన్ అటు నుంచి రివర్స్ అవుతుంది. ఇప్పటి వరకు జనసేనను నమ్ముకుని వున్నవారు వున్నారు. ఇప్పుడు తెలుగుదేశంలోంచి జంప్ అని వచ్చిన వారికి టికెట్ లు ఇస్తే వ్యవహారం ఎలా వుంటుంది?
సర్దుబాటు చేసుకుంటారు. నచ్చ చెఫ్పుకుంటారు. అని అనుకుందాం. అసలు సమస్య లోకల్ ఈక్వేషన్ల దగ్గర వస్తుంది. అక్కడే కాస్ట్ పాలిటిక్స్ అసలు సిసలు రాజకీయం ప్లే చేస్తాయి. సామాజిక వర్గాల మధ్య వున్న వైరుధ్యాలు కీలకం అవుతాయి. జనసేన తన టికెట్ లు ఉదారంగా కాపుయేతరులకు కేటాయించి అసలు సిసలు రాజకీయం చేయాల్సి వుంది. కానీ ఆ పార్టీ తమ ఓన్ అనుకుంటున్న వర్గాలు దీనిని జీర్ణించుకోలేవు. పైగా కులాల తూకంతో టికెట్ లు వేసి, ఎవరూ ఊహించని పేర్లను రంగంలోకి దింపడంలో వైకాపా స్ట్రాటజీలు ఇప్పటికి చాలాసార్లు ప్రూవ్ అయ్యాయి. అందువల్ల లోకల్ గా అన్ని విధాలా కాస్ట్ పాలిటిక్స్ నే కీలకం అవుతాయి.
రాష్ట్రంలో బిసి ఓట్లు ఎక్కువ. బిసి ఓట్లు కీలకం. ఇప్పటి వరకు వైకాపా ఎలాగూ బిసిలతోనే వెళ్తోంది. తెలుగుదేశం కూడా బిసిల కే ఎక్కువ సీట్లు ఇస్తుంది. అది తప్పదు. ఇక జనసేన ఏం చేస్తుంది? తను కూడా బిసిలతోనే వెళ్తే ఇక కాపు ఓట్లు సాలిడ్ గా పడవు. కాదు కాపులతో వెళ్తే బిసిల ఓట్లు దేశం, వైకాపాలకు పోతాయి. ఎలా చూసినా, జనసేనకు బిసి ఓట్లతో కాస్త సమస్యే.
ఇలాంటి నేపథ్యంలో జనసేనకు ఇచ్చే నలభై, యాభై స్థానాలను గట్టిగా స్ట్రాటజీలు పాటించి ముందుకు వెళ్తే వైకాపాకు ప్లస్ అవుతుంది. అది తేదేపాకు మరీ ప్రమాదం. అందువల్ల పొత్తుల కన్నా కేటాయించే సీట్లు, ఎంపిక చేసే అభ్యర్థులే ఎక్కువ కీలకం అయ్యే పాయింట్లు.
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వుంది. ఏణ్ణర్థం ముందుగానే కీలక సామాజక వర్గాలు కమ్మ..కాపు కలిసాయి అని క్లారిటీ రావడం కూడా రాజకీయాలను గట్టిగా ప్రభావితం చేసే అవకాశం వుంది.