జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం వ్యక్తిగత దూషణలకు తెగబడ్డారు. చేతుల్లోకి చెప్పు తీసుకుని మరీ హెచ్చరించుకునే పరిస్థితి వచ్చింది. కొడుకుల్లారా, రేయ్, రారా లాంటివి అలవోకగా దొర్లుతున్నాయి. జగన్ కేబినెట్లోని కాపు మంత్రులకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
“జనసైనికులా? బాబు బానిసలా?”
“యుద్ధానికి సిద్ధం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్.. పిరికోళ్లందరూ కలిసిరండి చూసుకుందాం” అంటూ అంబటి రాంబాబు సుతిమెత్తగా పవన్‌కు చీవాట్లు పెట్టారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ కావడంపై అంబటి చురకలు అంటించారు. బాబు బానిసలుగా జనసేన కార్యకర్తలను ఆయన అభివర్ణించారు. చంద్రబాబుతో సమావేశానికి ముందు యుద్ధానికి సిద్ధమని వైసీపీకి పవన్ హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశమై అనధికారికంగా పొత్తు కుదుర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు, పార్టీలు పక్కన పెట్టి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నట్టు అంబటి పరోక్షంగా విమర్శించారు. జగన్‌ను ఒక్కొక్కరిగా ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వల్లే అందరూ ఏకమవుతున్నారని అంబటి వెటకరించారు. యుద్ధానికి సిద్ధమని చెప్పి పలాయనం చిత్తగించి చంద్రబాబు సంకెక్కావంటూ పవన్‌పై సెటైర్ విసిరారు.