ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి చట్టసభ… పాలక,ప్రతిపక్ష పార్టీల మధ్య కొట్టుకోడానికి, తిట్టుకోడానికి వేదిక కావడం గమనార్హం. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ సభ్యులు పరస్పరం తిట్టుకోవడంతో పాటు కొట్టుకునే వరకూ వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఏడో రోజు సమావేశాలు ఇవాళ జరుగుతున్నాయి.
జీవో నంబర్-1 రద్దుకు టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ విషయమై వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు ఎప్పటిలాగే స్పీకర్ తమ్మినేని సీతారామ్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్‌పై టీడీపీ సభ్యుడు బాలవీరాంజనేయస్వామి చేయి వేయడం, దాన్ని తొలగించడానికి అధికార పార్టీ సభ్యుడు ప్రయత్నించారు. దీంతో పరస్పరం తోసుకున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ సభ్యుడు సుధాకర్‌బాబు పరస్పరం కొట్టుకున్నారని చెబుతున్నారు.
దీంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా టీడీపీ సభ్యులపై దూసుకెళ్లినట్టు సమాచారం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య తోపులాట జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టీడీపీ ఎమ్మెల్యేలు దూషించినట్టు తెలి సింది. ఉద్దేశపూర్వకంగానే దళిత ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిని బీసీ నాయకుడైన స్పీకర్‌పైకి చంద్రబాబు ఉసిగొల్పారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సభను స్పీకర్ వాయిదా వేశారు.
అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ సభలో ఇవాళ జరిగిన ఘటన దురదృష్టకరమైందన్నారు. సభలో వాడీవేడీ చర్చలు జరగడం చూశామన్నారు. కానీ చంద్రబాబు సభకు రాకుండా, తన సభ్యులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా టీడీపీ సభ్యుల ప్రవర్తనలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.