ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే అంటున్న మాట…ఒంటరిగా పోటీ చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా? అని. ఈ ఒక్క సవాల్‌తో వైఎస్ జగన్ తనలోని భయాన్ని బయట పెట్టుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భయం అనేది జగన్ ఎరుగరని వైసీపీ నేతలు, సీఎం సన్నిహితులు అంటుంటారు. అయితే అధికారాన్ని రుచి మరిగిన తర్వాత, దాన్ని కోల్పోడానికి ఎవరూ సిద్ధంగా ఉండదరు.
అయితే అధికారం అనేది ఐదేళ్లకోసారి ప్రజాతీర్పుపై ఆధారపడి వుంటుంది. ప్రజల మనసులను గెలుచుకున్న నేతలే అధికారాన్ని దక్కించుకుంటారు. ఏ సభలో మాట్లాడినా జగన్ అంతిమంగా పొత్తుల గురించే తీవ్రంగా స్పందిస్తుండడాన్ని గమనించొచ్చు. నిన్నటి తిరువూరులో జరిగిన సభలో వైఎస్ జగన్ ఏమన్నారంటే… “నా ప్రభుత్వం మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే, పొత్తుల కోసం వాళ్లు ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాళ్లకు సవాళ్లు విసురుతున్నా…175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం చంద్రబాబు, దత్తపుత్రుడికి ఉన్నాయా? వీళ్లలా పొత్తులు పెట్టుకునేందుకు నేను వెంపర్లాడను. నేను నమ్ముకున్నది ఆ దేవుడిని, ప్రజల్నే” అని అన్నారు.
పొత్తులతో వస్తే చంద్రబాబు, పవన్‌ను జగన్ తట్టుకోలేరనే సంకేతాల్సి తనకు తానుగా సీఎం పంపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని జగన్ చెప్పని సందర్భం వుండదు. ఒక్కో నాయకుడి నమ్మకాలు, విశ్వాసాలు ఒక్కో రకంగా వుంటాయి. తమ బలమైన ప్రత్యర్థి వైఎస్ జగన్‌ను ఓడించడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తుల్నే నమ్ముకున్నారు. ఇందులో తప్పేం వుంది?
అయితే రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసేందుకు జగన్ వ్మూహాత్మకంగా దమ్ముంటే ఒంటరిగా రావాలని సవాల్ విసురుతుండొచ్చు. కానీ పదేపదే అంటుండడంతో… వాళ్లిద్దరూ ఏకమైతే తాను తట్టుకోలేననే భయంతోనే ఆ నినాదాన్ని నెత్తికెత్తుకున్నారనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. రాజకీయం చదరంగంలో చివరికి ఎవరి ఎత్తులు ఫలిస్తాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.