రాజకీయాల్లో ఓటమి తీసుకొచ్చే మార్పు అంతాఇంతా కాదు. మరీ ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వారి మత్తు పోగొట్టాలంటే, ఓటమి తప్ప మరో మార్గమే లేదు. ఇటీవల మూడు పట్టభద్రుల స్థానాల్లో ఓటమిపాలైన వైసీపీకి భయం పట్టుకుంది. ఎన్నికలను ఈజీగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని గ్రాడ్యుయేట్స్ చేదు ఫలితాలు తగిన వార్నింగ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ అప్రమత్తమైంది.
ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాలని వైసీపీ పట్టుదలతో వుంది. అయితే టీడీపీ ఒక స్థానానికి అభ్యర్థిని నిలబెట్టడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఒక్కో ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే… ఇప్పుడు బలంతో వైసీపీ ఏడుకు ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీడీపీకి చెందిన నలుగురు, అలాగే జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు వుంది.
అయితే ఇటీవల వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఆనం కూడా తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని వైసీపీ భావిస్తోంది. దీంతో టీడీపీ బలం 21కి చేరుతుంది. ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే టీడీపీ సులువుగా ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధను గెలిపించుకుంటుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎవరైనా అసంతృప్తితో ఉంటూ, ప్రస్తుతం దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపుతారేమో అన్న అనుమానం వైసీపీని వెంటాడుతోంది. దీంతో ప్రతి ఒక్కరి ఓటును తమకు వేయించుకునేలా వైసీపీ పకడ్బందీగా వ్యూహం రచిస్తోంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. 22 మంది ఎమ్మెల్యేల బాధ్యతలను ఒకరిద్దరు మంత్రులకు సీఎం జగన్ అప్పగించారు.
ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానానికి ఒక అవగాహన వుంది. వారిపై గట్టి నిఘా వుంచింది. ఏ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటు వేశారో సులువుగా గుర్తించేలా పథకం రచించారు. అయితే ఏడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుపొందేందుకు వైసీపీ తన ప్రయత్న లోపం లేకుండా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీడు ఎంచి మేలు ఎంచాలనే చందంగా… ప్రతి ఒక్కరిపై నిఘా వుంచిందన్న వార్తలొస్తున్నాయి. ఓటమి తీసుకొచ్చిన మార్పుగా దీన్ని భావించాల్సి వుంటుంది.