తెలుగు మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావుకు సీఎం జగన్ చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈనాడు మీడియా సంస్థను అడ్డు పెట్టుకుని, తనను టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు రామోజీరావు కుట్రలకు తెరలేపారని జగన్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల్లో తనను పలుచన చేసేలా ఈనాడులో కథనాలు రాస్తూ, చంద్రబాబు కొమ్ము కాస్తున్నారనే అభిప్రాయాన్ని జగన్ అనేక సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు.
దుష్టచతుష్టయంలో రామోజీరావుకు జగన్ అగ్రస్థానం కల్పించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆర్థిక అవకతవకలను దొరికి పుచ్చుకున్న జగన్ ప్రభుత్వం, ఎలాగైనా రామోజీరావుని కటకటాలపాలు చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సీఐడీ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని శైలజాకిరణ్ నివాసంలో సోమవారం ఆమెతో పాటు రామోజీని కూడా సీఐడీ విచారణ చేపట్టడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
ఇంత కాలం అతిపెద్ద మీడియా గ్రూప్‌నకు అధిపతి అయిన రామోజీరావును టచ్ చేయడానికి ఏ ప్రభుత్వం సాహసించలేదు. అలాంటిది రామోజీని విచారించడానికి ఏపీ సీఐడీ టీమ్ వెళ్లడం ఆయన ఇంటికే వెళ్లడం గమనార్హం. ఇప్పటికే మార్గదర్శికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొందరు మేనేజర్లను కూడా అరెస్ట్ చేశారు. కొందరికి బెయిల్ కూడా వచ్చింది. తాజాగా రామోజీరావు, ఆయన కోడలు శైలజలను విచారించిన తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
రామోజీ, శైలజలను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే పట్టుదలతో వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ మార్గదర్శిలో సోదాలు, అలాగే వాళ్లిద్దరినీ విచారించడం వెనుక ఉద్దేశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామోజీ, శైలజను విచారణతోనే సరిపెడతారనుకోవడం అవివేకం అవుతుంది. కావున రామోజీకి సంబంధించి ప్రతి అడుగు సంచలనమే. మరి ఆయన్ను కాపాడుకునేందుకు చంద్రబాబు ఏ మేరకు ప్రయత్నిస్తారో చూడాలి.