ఆ మాట జ‌గ‌న్ ముఖం మీదే చెబుతారు!

ఏదైనా నేరుగా చెప్ప‌డం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నైజం. ఒక్కోసారి జ‌గ‌న్ స్వ‌భావం రాజ‌కీయంగా లాభ‌మో తెస్తుంది. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో న‌ష్టం కూడా జ‌రుగుతోంటోంది. అయితే స్వ‌భావానికి విరుద్ధంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌రు. ఎన్నిక‌ల‌కు ఏడాది…

ఏదైనా నేరుగా చెప్ప‌డం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నైజం. ఒక్కోసారి జ‌గ‌న్ స్వ‌భావం రాజ‌కీయంగా లాభ‌మో తెస్తుంది. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో న‌ష్టం కూడా జ‌రుగుతోంటోంది. అయితే స్వ‌భావానికి విరుద్ధంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌రు. ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మయం ఉన్న నేప‌థ్యంలో, అభ్య‌ర్థుల ఎంపిక‌పై వైఎస్ జ‌గ‌న్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప‌రిపాల‌న‌పై కంటే పార్టీ కార్య‌క‌లాపాల‌పై జ‌గ‌న్ ఎక్కువ దృష్టి సారించారు.

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌తో జ‌గ‌న్ సోమవారం స‌మావేశం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అంబ‌టి రాంబాబు వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. గ‌డ‌ప‌కుగ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్షిస్తార‌న్నారు. ఎవ‌రిదైనా గ్రాఫ్ బాగాలేక‌పోతే త‌ప్పుకోవాల‌ని ముందే చెబుతార‌ని అంబ‌టి అన్నారు.  

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌లేని వారికి, పార్టీ అధికారంలోకి వ‌స్తే ప్రాధాన్యం ఇస్తామ‌ని స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు జ‌గ‌న్ ముఖం మీదే చెబుతార‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. కానీ ఇవాళ్టి స‌మావేశంలో మాత్రం రానున్న ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌ని విష‌యాన్ని చెబుతార‌ని తాను కోవ‌డం లేద‌ని అంబ‌టి అన్నారు. అలాగే మంత్రివ‌ర్గ మార్పుపై త‌న వ‌ద్ద ఎలాంటి స‌మాచారం లేద‌న్నారు. ఈ స‌మ‌యంలో మంత్రివ‌ర్గ మార్పు వుంటుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

పైకి ఎవ‌రెన్ని మాట‌లు మాట్లాడుతున్నా… లోలోప‌ల మాత్రం సీఎం జ‌గ‌న్ టికెట్ల‌పై ఏమంటారో అనే భ‌యం మాత్రం వుంది. మ‌రీ ముఖ్యంగా సెంటిమెంట్ల‌కు జ‌గ‌న్ లొంగిపోయే ర‌కం కాదు. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లిగిస్తున్నార‌ని అనుకుంటే ఎవ‌రినైనా జ‌గ‌న్ ప‌క్క‌న పెడ‌తార‌నే ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అది ఎంత వ‌ర‌కూ ఈ ద‌ఫా ప‌ని చేస్తుందో చూడాలి.