పాదయాత్రల సీజన్ ప్రస్తుతం దేశంలో సాగుతోంది. ఏ యాత్ర అయినా లక్ష్యం ఒక్కటే. అధికారం పట్టేయడం. అది బస్సు యాత్ర అనుకున్నా మరో యాత్రగా వస్తున్నా కుర్చీ పాలిటిక్స్ కోసమే. సీటు పట్టడం కోసం యాత్రలు చేస్తున్నారు అన్నది జనాలకు అర్ధమయ్యాక పాదయాత్రలు ఎంతవరకు మేలు చేస్తాయో సదరు రాజకీయ జీవులకే తెలియాలి.
దేశంలో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఆయన యాత్ర చేస్తూండంగానే గుజరాత్ చేజారింది. ఇక కాంగ్రెస్ ఎంతవరకూ బలపడింది ఎవరికీ క్లారిటీ లేదు. తెలంగాణాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర అంటున్నారు. అదీ ఈ నెలలోనే.
ఇపుడు ఏపీ కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు పాదయాత్రకు సిద్ధమని ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి తేవడం కోసమే ఈ యాత్ర అంటున్నారు. ఈ నెల 26 నుంచి గిడుగు పాదయాత్ర మొదలవుతోంది. విశాఖ వేదికగా ఆయన అడుగులు ఏపీ అంతా సాగనున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తెస్తామని కాంగ్రెస్ ని ఏపీలో అధికారంలోకి తెస్తామని గిడుగు అంటున్నారు. కాంగ్రెస్ పాదయాత్ర తరువాత ఏపీలో తెలుగుదేశం చినబాబు లోకేష్ పాదయాత్ర 27 నుంచి ఉంది. ఈ పాదయాత్ర కుప్పం నుంచి స్టార్ట్ అవుతుంది. కుప్పం అయినా విశాఖ అయినా పాదయాత్ర టార్గెట్ మాత్రం పవర్ కోసమే. కాంగ్రెస్ పాదయాత్ర అంటే ఎంతమంది అనుసరిస్తారో అన్నది ఆసక్తిగా చూడాల్సిన అంశం.