సంక్రాంతిని పురస్కరించుకుని ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఏ ఊరు చూసినా కోడి పందేల బరి కనిపిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే సందర్భంలో ఏపీలో పొలిటికల్ పందెం కోళ్లు రెడీ అవుతున్నాయి. ఎన్నికల బరిలో దిగి తండ్లాడేందుకు తహతహలాడుతున్నాయి.
వైఎస్ జగన్ ఒక్కడూ ఒక వైపు, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ , చిన్నాచితకా నేతలంతా కలిసి ఒక జట్టుగా ఏర్పడేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జగన్ మొదటి నుంచి ఒంటరిగానే బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు కలిసి ఒకసారి జట్టుగా, మరోసారి విడివిడిగా బరిలో దిగారు. జట్టుగా దిగి జగన్‌ను ఓడించారు. వేర్వేరుగా పోటీ చేసి చావుదెబ్బ తిన్నారు. అందుకే జగన్ చేతిలో వీరమరణం పొందలేను మహాప్రభో అంటూ పవన్ మొత్తుకుంటున్నారు.
తన వాళ్లేమో ఒంటరిగా పోటీ చేసి సీఎం పీఠంపై కూచోపెడ్దామని అరుస్తుంటే… మిమ్మల్ని నమ్మలేను, నమ్మి మోసపోలేనని ఒంటరి పోటీ నుంచి పవన్ పలాయనం పోతున్నారు. చంద్రబాబుదీ ఇదే పరిస్థితి. ఇద్దరం కలిస్తే తప్ప జగన్‌ను ఎదుర్కోలేమనే నిర్ణయానికి చంద్రబాబు, పవన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో జట్టుగా ఏర్పడేందుకు తరచూ భేటీ అవుతున్నారు.
మరోవైపు మిత్రపక్షమైన బీజేపీ చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఒంటరిగా బరిలో దిగాలా? లేక టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలా? అనే అంశంపై తర్జనభర్జన పడుతోంది. ఏపీ పొలిటికల్ బరిపై అనధికారికంగా ఒక అవగాహన వచ్చింది. ఇంకా మరింత స్పష్టత రావాల్సి వుంది. అధికార పార్టీ మాత్రం టీడీపీ, జనసేన కూటమితో తండ్లాడేందుకు సిద్ధమైందన్నది నిజం. బరికి ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కత్తులు నూరుకుంటున్నారు.