తాను పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచే వాళ్లకు టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఉన్నట్టు సమాచారం. టీడీపీతో జనసేన పొత్తు కుదుర్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా పవన్‌కల్యాణే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సభలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో జనసేన టికెట్‌కు గిరాకీ ఏర్పడింది. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే విషయమై రకరకాల ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ టికెట్ల విషయమై ఎవరికి ఇవ్వాలో చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తనపై నమ్మకం, అభిమానంతో వెంట నడిచే వాళ్లకే ఇవ్వాలని దృఢంగా నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. పవన్ వెంట మొదటి నుంచి నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి, శివశంకర్, మహేశ్, కిరణ్‌రాయల్, హరిప్రసాద్ తదితరులు వున్నారు. ఇలాంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.
జనసేన నుంచి పోటీ చేసేందుకు అప్పుడే కొందరు ఆకాశం నుంచి దిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీతో పొత్తు కావడంతో కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు వుంటాయనే నమ్మకంతో అలాంటి వాళ్లంతా జనసేన నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అలాంటి వాళ్ల గురించి స్థానిక జనసేన నాయకులు పసిగట్టి అప్రమత్తంగా వుంటున్నారు.
కేవలం పదవి కోసమే వచ్చే వాళ్లు పార్టీ కోసం గట్టిగా నిలబడరని, వారికి టికెట్ ఇవ్వొద్దని నాదెండ్ల మనోహర్ ద్వారా పవన్ దృష్టికి తీసుకెళుతున్నారని తెలిసింది. అయితే అనుకున్న వాళ్లకే పవన్ టికెట్ ఇవ్వగలరా? రకరకాల ప్రలోభాలు, ఒత్తిళ్లకు ఆయన లొంగిపోతారా? అనేది రానున్న కాలంలో తెలియనుంది.