అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సొంత పార్టీ ఎంపీలకే బిగ్ చాలెంజ్ చేశారు. మహిళా ఎంపీలకు ఈ సవాల్ విసిరారు. ఆడుదాం ఆంధ్రా అంటూ వైసీపీ ప్రభుత్వం డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ ఏపీలో అతి పెద్ద క్రీడా సంబరానికి తెర తీస్తోంది.
ఈ కార్యక్రమం గురించి అరకు ఎంపీ మాధవి మాట్లాడుతూ క్రీడలకు వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారుల ప్రతిభ వెలుగు చూస్తుంది అని ఆశించారు.
పనిలో పనిగా తన తోటి మహిళా ఎంపీలకూ ఆడుదాం ఆంధ్రా పోటీలలో కలసి ఆడుదామని ఆమె పిలుపు ఇచ్చారు నేను మా క్రీడాకారులతో మీ ప్రాంతానికి వస్తాను, మీ నియోజకవర్గాలలో మీ క్రీడాకారులతో కలసి మీరూ ఆడాలి. మనలో మనం ఆడి గెలుపు తేల్చుకోవాలని ఆమె తమాషా అయిన చాలెంజ్ ని విసిసారు.
అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, కాకినాడ ఎంపీ వంగా గీతలకు ఆమె ఈ చాలెంజ్ చేశారు. ఈసారి ఆడుదాం ఆంధ్రాతో యువత మాత్రమే కాదు ఎంపీలు కూడా గెలవాలని ఆమె కోరుకున్నారు. మాధవి విసిరిన ఈ సవాల్ కి తోటి మహిళా ఎంపీలు ఎలా రియాక్ట్ అవుతారో కానీ మాధవిలోని క్రీడా స్పూర్తిని మాత్రం అంతా మెచ్చుకుంటున్నారు.