సీబీఐ ధోరణి దుర్మార్గం అనిపించుకోదా?

వివేకానందరెడ్డి హత్యను స్వయంగా అవినాష్ రెడ్డి చేయించాడనే అనుమానం ఉంటే సీబీఐ ఆయనను నిరభ్యంతరంగా ఎలాంటి శషబిషలు లేకుండా అరెస్టు చేసుకోవచ్చు. ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసినట్టుగానే.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు…

వివేకానందరెడ్డి హత్యను స్వయంగా అవినాష్ రెడ్డి చేయించాడనే అనుమానం ఉంటే సీబీఐ ఆయనను నిరభ్యంతరంగా ఎలాంటి శషబిషలు లేకుండా అరెస్టు చేసుకోవచ్చు. ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసినట్టుగానే.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చి.. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత.. రిమాండునుంచి మళ్లీ సీబీఐ కస్టడీకి తీసుకుని తమకు అవసరమైనట్టుగా విచారించుకోవచ్చు. లేదా, అవినాష్ రెడ్డిని కేవలం వివరాలు సేకరించడానికి మాత్రమే నోటీసులు ఇచ్చి పిలిపిస్తూ ఉంటే గనుక.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు కొంత వ్యవధి ఇవ్వాలి. 

ఒకవైపు తల్లి గుండెపోటుతో ఆస్పత్రిలో ఉంది.. తండ్రి జైల్లో ఉన్నాడు. కన్న కొడుకు ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే అయిదు దఫాలు ఆయనను విచారించిన సీబీఐ, మరోసారి విచారించడానికి అంతగా ఎందుకు ఆత్రపడుతోంది అనేది ప్రశ్నార్థకం. అవినాష్ రెడ్డి దేశం విడిచి పారిపోవడం లేదు. ఆయనేమీ అంతర్జాతీయ నేరస్తుడు కాదు. కానీ.. ఆయన పట్ల సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, నోటీసులు సర్వ్ చేస్తున్న తీరు కక్ష సాధింపు ధోరణిలాగా, దుర్మార్గంగా కనిపిస్తోంది.

అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనేది సీబీఐ వారు కోర్టుకు చెబుతున్న మాటల్లోను, పచ్చమీడియా వారి కుట్రపూరిత ప్రచారంలోను మనకు కనిపిస్తుంది తప్ప.. ఏకపక్షంగా ఆ నింద వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాలుగుసార్లు మాత్రమే ఆయన విచారణకు పిలిచిన సందర్భాలలో గడువు కోరారు. అయిదుసార్లు విచారణకు హాజరయ్యారు. విచారణ ఎగ్గొట్టారు అని రాసే కుట్రపూరిత పుచ్చు మీడియా.. అది కేవలం గడువు కోరడమే తప్ప.. విచారణకు గైర్హాజరు కాదని కనీస అవగాహన లేకుండా రాస్తుంటుంది.

తాజాగా కూడా ఆయన విచారణకు హాజరవడానికే బయలుదేరారు. మార్గమధ్యంలో తల్లికి గుండెపోటు అనే కబురు వచ్చింది. ఆయన మార్గమధ్యంలోనే కాన్వాయ్ ను కడపవైపు మళ్లించారు. సీబీఐ వెంటాడడం చూసేవారికి కాస్త అతి అనిపించిన వ్యవహారం. కడపలో గుండెపోటు వచ్చిన ఆయన తల్లిని అంబులెన్సులో తీసుకుని వారు హైదరాబాదు వైపు బయలుదేరారు. చివరివరకు కర్నూలులోనే ఆస్పత్రిలో చేర్చారు. అవినాష్ తల్లితో ఆస్పత్రి వద్దనే ఉన్నారు.

చికిత్స పొందుతున్న తల్లిని వదలి విచారణకు రమ్మని సీబీఐ పిలవవలసినంత అర్జెన్సీ ఉందా? రెండురోజుల వ్యవధిలోనే రావాలని వారు మళ్లీ వాట్సప్ ద్వారా నోటీసులు పంపడం హేయం. ఇప్పుడు కూడా ఆయన విచారణ ఎగ్గొడుతున్నారని ఎవరైనా వ్యాఖ్యానిస్తే వారి నీచమైన బుద్ధిమీద జాలి పడాలే తప్ప ఏం అనలేం. ఆయన చాలా పద్ధతిగా తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జి అయిన తర్వాత వస్తానని ఆయన అనడం తప్పు అవుతుందా? సీబీఐ అప్పటిదాకా ఆగలేని స్థితిలో ఉందా? అవినాష్ నేరస్తుడు అని వారు నిరూపించగలిగితే.. ఈ నోటీసులతో సంబంధం లేకుండా కూడా అరెస్టు చేసి తీసుకువెళ్లే అధికారం వాళ్లకి ఉంటుంది, అలా చేయవచ్చు. 

కానీ, ఏ ఆధారాలూ లేకుండా విచారణ కోసం అంటూ.. తల్లిని ఆస్పత్రిలో విడిచిపెట్టి రమ్మని పురమాయించడం సీబీఐ దుర్మార్గ వైఖరికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.